LOADING...
Gandhi Sarovar: గాంధీ సరోవర్‌కు 100 ఎకరాల రక్షణశాఖ భూమి కోరిన సీఎం
గాంధీ సరోవర్‌కు 100 ఎకరాల రక్షణశాఖ భూమి కోరిన సీఎం

Gandhi Sarovar: గాంధీ సరోవర్‌కు 100 ఎకరాల రక్షణశాఖ భూమి కోరిన సీఎం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2026
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో కీలక భాగంగా, ఈసీ-మూసీ నదుల సంగమ ప్రాంతంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా రూపొందించనున్న గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు కోసం అవసరమైన 100 ఎకరాల రక్షణశాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. ఈ అంశంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలపై చర్చించేందుకు సీఎం గురువారం న్యూఢిల్లీలో నలుగురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ఆహారం-ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషిలను ఆయన వేర్వేరుగా కలిశారు.

వివరాలు 

రాజ్‌నాథ్‌సింగ్‌కు ఆహ్వానం

ఈసీ-మూసీ నదుల సంగమ ప్రాంతంలో ఉన్న బాపూఘాట్‌ వద్ద 1948లో జాతిపిత మహాత్మాగాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన చారిత్రక ప్రదేశంలో గాంధీ సరోవర్‌ ప్రాజెక్టును చేపడుతున్నట్లు సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఫిబ్రవరి నెలాఖరులో నిర్వహించనున్నందున అందుకు హాజరుకావాలని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు వినతి వరంగల్‌కు సమీపంలోని మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని, వీలైనంత త్వరగా విమాన రాకపోకలు ప్రారంభించేలా పనులు పూర్తిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడిని కోరారు. అలాగే ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

వివరాలు 

హైస్పీడ్‌ రైల్‌కారిడార్‌కు 600 ఎకరాలు

హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు, పుణె దిశగా ప్రతిపాదించిన హైస్పీడ్‌ రైలు కారిడార్ల కోసం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో 600 ఎకరాల భూమిని కేటాయిస్తామని ముఖ్యమంత్రి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు హామీ ఇచ్చారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్‌ నుంచే హైస్పీడ్‌ రైలు మార్గాలను ప్రారంభించాలని కోరారు. అలాగే కృష్ణా-వికారాబాద్‌ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతోనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కొడంగల్‌, టేకల్‌కోడ్‌, దౌల్తాబాద్‌ ప్రాంతాలను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని సీఎం వివరించగా, రైల్వే మంత్రి దీనిపై సానుకూల దృక్పథం వ్యక్తం చేశారు.

Advertisement

వివరాలు 

18 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకోవాలి

2025-26 వానాకాలం పంటకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సేకరించిన 18 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయాలని ఆహారం-ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషిని ముఖ్యమంత్రి కోరారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వానాకాలం పంటకు సంబంధించి 53.73 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు మాత్రమే అనుమతి ఇచ్చిందని, అయితే రాష్ట్రంలో అధిక దిగుబడులు రావడంతో అదనంగా 18 లక్షల టన్నులు సేకరించాల్సి వచ్చిందని సీఎం వివరించారు. అందువల్ల 10 శాతం నూకతో సహా ఈ ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

వివరాలు 

18 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకోవాలి

అదేవిధంగా 2024-25 యాసంగి పంటకు సంబంధించి ఇప్పటికే అనుమతిచ్చిన 5 శాతం నూకతో పాటు అదనంగా 10 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ మిల్లింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే 2014-15 వానాకాలంలో ఎఫ్‌సీఐకి సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులకు తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సమావేశాల్లో ఎంపీలు మల్లు రవి, సురేశ్‌ షెట్కార్‌, రామసహాయం రఘురాంరెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు, కార్యదర్శి మాణిక్‌రాజ్‌, కేంద్ర పథకాల సమన్వయకర్త డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు.

వివరాలు 

హైస్పీడ్‌ కారిడార్ల ఎలైన్‌మెంట్లపై ముఖ్యమంత్రి సూచనలు

హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైలు కారిడార్ల ఎలైన్‌మెంట్‌కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కన్సల్టెంట్‌ సంస్థకు పలు కీలక సూచనలు చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన హైస్పీడ్‌ రైలు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ (వివరమైన ప్రాజెక్టు నివేదిక) తయారీ బాధ్యతను రైల్వేశాఖ ఆర్‌ఐటీఈఎస్‌ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ప్రతినిధులు దిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రాజెక్టు వివరాలను వివరించారు.

Advertisement