SLBC: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి దిశగా మరో అడుగు.. వైమానిక సర్వేకు సీఎం శ్రీకారం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ ప్రాజెక్ట్ పనులు వేగంగా పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో వైమానిక విద్యుదయస్కాంత సర్వే (Aerial Electromagnetic Survey)ను నేడు ప్రారంభించనున్నారు. ఈ సర్వేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సోమవారం నాడు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయం నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి, మధ్యాహ్నం 1:25 గంటలకు అచ్చంపేట నియోజకవర్గంలోని రెండో హెలిప్యాడ్ వద్ద స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు.
వివరాలు
హెలికాప్టర్ ఆధారిత ఆధునిక సర్వే
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రోమాగ్నటిక్ లూప్ ప్రాంతాన్ని పరిశీలించి,హెలికాప్టర్‌లో ఉన్న డేటా అక్విజిషన్ సిస్టమ్‌ను తనిఖీ చేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి సమక్షంలో ఎలక్ట్రోమాగ్నటిక్ లూప్‌తో కూడిన సర్వే హెలికాప్టర్ టేకాఫ్ అవుతుంది. సొరంగ నిపుణుల సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) ఆధ్వర్యంలో హెలికాప్టర్ ఆధారిత వీటిఈఎమ్ ప్లస్ మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఇందులో 24 మీటర్ల వ్యాసం గల ప్రత్యేక ట్రాన్స్‌మిటర్ లూప్‌ను హెలికాప్టర్‌కు వేలాడదీసి, సొరంగ మార్గం మీదుగా ఎగురవేస్తారు. ఈ సాంకేతిక పద్ధతి ద్వారా భూమిలోకి విద్యుదయస్కాంత తరంగాలు పంపించి, 800 నుంచి 1000 మీటర్ల లోతులోని భూగర్భ వివరాలు సేకరిస్తారు.
వివరాలు
హెలికాప్టర్ ఆధారిత ఆధునిక సర్వే
సేకరించిన ఈ సమాచారం ద్వారా సొరంగ మార్గంలో ఉన్న చీలిక ప్రాంతాలు లేదా నీటి వనరులు ముందుగానే గుర్తించవచ్చు. దాంతో తవ్వక పద్ధతుల్లో మార్పులు చేసి, పనులు వేగంగా, సురక్షితంగా పూర్తి చేయగలుగుతారు. ఇందుకోసం ప్రభుత్వం దేశంలోని అగ్రశ్రేణి సొరంగ మరియు రాక్ మెకానిక్స్ నిపుణులతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో భారత సైన్య మాజీ ఇంజినీర్ ఇన్‌చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్‌ను ప్రత్యేక సలహాదారుగా, కల్నల్ పరీక్షిత్ మెహ్రాను సొరంగ నిపుణుడిగా ఏడాది పాటు నియమించారు.
వివరాలు
ప్రాజెక్ట్ వల్ల లాభాలు
ఈ సొరంగం పూర్తయితే గ్రావిటీ ఆధారంగా నీటిని తరలించడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాదీ ₹500 కోట్లకు పైగా విద్యుత్ ఖర్చు చేస్తోంది. సొరంగం పూర్తవడంతో ఈ భారీ వ్యయం తగ్గి, ఆ మొత్తాన్ని ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించవచ్చు. అంతేకాదు, ఇంత దీర్ఘమైన సొరంగం సురక్షితంగా పూర్తి చేయడం ద్వారా ఇంజినీరింగ్ రంగంలో తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ గుర్తింపు పొందే అవకాశం ఉంది.
వివరాలు
ప్రాజెక్ట్ లక్ష్యం
1983లో నల్గొండ జిల్లాలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు 3 లక్షల ఎకరాలకు సాగునీరు, అలాగే ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగానే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం నిర్మాణం చేపట్టబడింది. ఈ సొరంగం మొత్తం పొడవు 43.93 కిలోమీటర్లు. మధ్యలో ఎటువంటి బ్రేక్ లేకుండా తవ్వబడుతున్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగంగా ఇది రికార్డుల్లో నిలవనుంది. ప్రస్తుతం శ్రీశైలం ఇన్‌లెట్ వైపు నుంచి 13.94 కి.మీ, దేవరకొండ అవుట్‌లెట్ వైపు నుంచి 20.4 కి.మీ తవ్వక పనులు పూర్తయ్యాయి. ఇంకా 9.8 కి.మీ తవ్వకం కొనసాగుతోంది.
వివరాలు
ఎదుర్కొన్న సవాళ్లు
ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచీ అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. 2009 అక్టోబరులో వచ్చిన భారీ వరదల కారణంగా టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM)నీట మునిగింది. అదేవిధంగా,భూగర్భంలో ఉన్న ప్రమాదకర ప్రాంతాల వల్ల పురోగతి నెలకు కేవలం 75 మీటర్ల వద్దే నిలిచిపోయింది. ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 22న జరిగిన భూగర్భ ప్రమాదంలో నీరు,బురద,శిథిలాలు సొరంగంలోకి ప్రవేశించి సుమారు 2.5కి.మీ మేర మునిగిపోయాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.ఈఘటన అనంతరం ఉన్నత సాంకేతిక కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం అధునాతన సొరంగ తవ్వక పద్ధతులను ఉపయోగించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ కేబినెట్ అక్టోబర్ 23న ఆమోదం తెలిపింది.సొరంగ పనులను 2028 మధ్య నాటికి పూర్తిచేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది.