ఇరకాటంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. 50 శాతం కమిషన్ ఫోన్ పే చేయాలంటూ వాల్ పోస్టర్లు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఇరకాటంలో పడ్డారు. త్వరలోనే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం చౌహన్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శస్త్రానాలను సంధిస్తోంది. చౌహన్ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందంటూ హాట్ పోస్టర్స్ రిలీజ్ చేసింది. రాజధాని భోపాల్ నగర వీధుల్లో ఆయా వాల్ పోస్టర్లను అంటించింది. ఇందులో భాగంగా ఫోన్‌పే లోగో తరహాలో పేమెంట్ యాప్ ను డిజైన్ చేసి వినియోగించింది. మరోవైపు అనుమతి లేకుండా తమ లోగోను వినియోగించడంపై ఫోన్ పే యాప్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు లోగోను మరోసారి వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని హెచ్చరించింది.
కర్ణాటక ఎన్నికల్లోనూ ఇదే తరహా ప్రచారం
ప్రభుత్వంపై నిరసనల్లో భాగంగానే క్యూఆర్ కోడ్ మధ్యలో ముఖ్యమంత్రి చౌహన్ ఫొటో ఏర్పాటు చేశారు. ఏ పని జరగాలన్నా 50 శాతం మేర కమిషన్ ఇవ్వాలంటూ పోస్టర్లు వెలిశాయి. సదరు పోస్టర్ల నుంచి తమ సంస్థ లోగోను వెంటనే తొలగించాలని ఫోన్ పే డిమాండ్ చేసింది. ఎవరైనా సరే అనుమతి లేకుండా తమ లోగోను వాడకూడదని తేల్చి చెప్పింది. ఏ రాజకీయ పార్టీతోనూ తమకు సంబంధం లేదని వెల్లడించింది. ఇటీవలే కర్ణాటక ఎన్నికల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా పోస్టర్లే వెలిశాయి. అక్కడి ప్రభుత్వం అవినీతిమయం అంటూ పేసీఎం పేరిట పోస్టర్లు భారీగా ఏర్పాటు చేశారు. ఒకరకంగా కన్నడనాటలో పేసీఎం ప్రచారం బీజేపీ ఓట్లకు కొంత మేర గండికొట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.