
Hindi Language Row: 'హిందీ' విధానానికి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్ .. స్వంత రాష్ట్ర విద్యా విధానం ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం-తమిళనాడు మధ్య కొనసాగుతోన్న హిందీ భాష వివాదం నేపథ్యంలో శుక్రవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా స్వంత రాష్ట్ర విద్యా విధానాన్నిప్రకటించారు. ఇది,కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంకు ప్రత్యామ్నాయంగా, ఆయన ఈ నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. చెన్నైలోని అన్నా సెంటినరీ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ కొత్త రాష్ట్ర విద్యా విధానాన్ని ఆవిష్కరించారు. కేంద్రం సూచించిన త్రిభాషా సూత్రంను తిరస్కరించి,ద్విభాషా విధానాన్ని అనుసరించేలా ఈ పాలసీని రూపొందించారు.
వివరాలు
మాతృభాషతో పాటు ఆంగ్ల భాష,కృత్రిమ మేధస్సు (AI),సైన్స్ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం
ఈ ముసాయిదా రూపకల్పన కోసం 2022లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మురుగేశన్ ఆధ్వర్యంలో 14 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. గత సంవత్సరం ఈ కమిటీ తన నివేదికను సీఎంకు సమర్పించగా, స్టాలిన్ ప్రభుత్వం దానిని పరిశీలించి, ఇప్పుడు అధికారికంగా ఈ కొత్త విద్యా విధానాన్ని ప్రకటించింది. ఈ రాష్ట్ర విద్యా విధానంలో మాతృభాషతో పాటు ఆంగ్ల భాష,కృత్రిమ మేధస్సు (AI),సైన్స్ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. అదేవిధంగా,నీట్ (NEET) వంటి ప్రవేశపరీక్షలను తమిళనాడు ప్రభుత్వం బహిరంగంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అందువల్ల, ఈ కొత్త విధానంలో ప్రవేశపరీక్షల స్థానంలో మార్కుల ఆధారిత ప్రవేశ విధానంను ప్రతిపాదించారు.
వివరాలు
సమగ్ర శిక్షా పథకం ఇవ్వాల్సిన ₹2,152 కోట్లు కేంద్రం విడుదల చేయలేదని ఆరోపణ
11వ, 12వ తరగతులలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఆర్ట్స్, సైన్స్ వంటి అండర్‌గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే విధానాన్ని ఇందులో చేర్చారు. త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరి చేసే జాతీయ విద్యావిధానం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడుల మధ్య వివాదం కొంతకాలంగా కొనసాగుతోంది. హిందీ భాషను తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని స్టాలిన్ సర్కారు ఆరోపిస్తోంది. అంతేకాక, జాతీయ విద్యావిధానం అమలు చేయలేదనే కారణంతో, సమగ్ర శిక్షా పథకం (Samagra Shiksha Scheme) కింద తమిళనాడుకు ఇవ్వాల్సిన ₹2,152 కోట్లు కేంద్రం విడుదల చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది.