Cm Jagan : సీఎం జగన్ సహా 41మందికి నోటీసులు..రఘురామ పిటిషన్ విచారణ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో 40 మంది ఈ జాబితాలో ఉన్నారు. ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (MP Raghurama) దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయన్న రఘురామ, వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)తో విచారణ జరిపించాలని పిటిషన్'లో కోరారు.
అసలు ఈ పిటిషన్'కు అర్హత లేదన్న ఏజీ, కాదన్న డిఫెన్స్
ఈ క్రమంలోనే విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ (AG Sri ram) వాదించారు. సదరు పిటిషన్'లో ప్రజా ప్రయోజనం ఏమీ లేదని,కేవలం వ్యక్తిగత దురుద్దేశంతోనే దాఖలు చేశారని ఏజీ కోర్టుకు వివరించారు.ఒకరకంగా ఈ పిటిషన్'కు విచారణ అర్హత లేదన్నారు. పిటిషన్ దాఖలు అనంతరం 'ప్రభుత్వ అవినీతి' అని మీడియాలో రఘురామ కృష్ణం రాజు మాట్లాడారని ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రఘురామ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదించారు. ఈ పిటిషన్ ఫైల్ కాగానే ప్రభుత్వం పలు రికార్డులను ధ్వంసం చేసిందని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణ వాయిదా వేసింది.