DWCRA: డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా.. స్త్రీనిధి రుణాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార శుద్ధి రంగంలో చిన్నతరహా పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళలకు సులభంగా రుణాలు అందేలా చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల పథకం కింద బ్యాంకుల ద్వారా రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇకపై స్త్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేయనుంది. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న 35శాతం రాయితీని, ఇకపై స్త్రీనిధి ద్వారా తీసుకునే రుణాలకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా, అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
వివరాలు
మహిళలకు పెద్ద ఊరట
ఈ నిర్ణయం వల్ల ఆహార శుద్ధి రంగంలో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలనుకునే మహిళలకు పెద్ద ఊరట లభించనుంది. 2026-27 సంవత్సరానికి సంబంధించి మొత్తం 5 వేల యూనిట్లకు ఈ సదుపాయం అమలు చేయాలని కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు వారం రోజుల్లో అధికారికంగా విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఈ పథకం కింద పరిశ్రమలు స్థాపించాలనుకునే వారు తప్పనిసరిగా బ్యాంకుల ద్వారా రుణాలు పొందాల్సి వస్తోంది. అయితే చాలా మందికి సకాలంలో వ్యక్తిగత రుణాలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, సెర్ప్ పరిధిలో పనిచేస్తున్న స్త్రీనిధి సంస్థ ద్వారా ఇచ్చే రుణాలకు కూడా పథకం రాయితీ వర్తింపజేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.
వివరాలు
ప్లాంట్ వ్యయంపై రాయితీ వర్తింపు...
రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇటీవల ఈ అంశంపై కేంద్రంతో చర్చలు జరపగా సానుకూల నిర్ణయం వచ్చింది. జీవనోపాధి కోసం ఏర్పాటు చేసే యూనిట్లలో ప్లాంట్, యంత్రాలకు అయ్యే ఖర్చుపై 35 శాతం రాయితీ వర్తించనుంది. మొత్తం యూనిట్ వ్యయంలో లబ్ధిదారుడి వాటా 10 శాతం ఉండాలి. మిగిలిన అవసరాలకు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు స్త్రీనిధి ద్వారా రుణం పొందే అవకాశం కల్పించనున్నారు.