LOADING...
Rajasthan District Collector: పేదలకు సంక్షేమ పథకాలు అందేవరకు జీతం తీసుకోను: రాజస్థాన్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్
రాజస్థాన్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్

Rajasthan District Collector: పేదలకు సంక్షేమ పథకాలు అందేవరకు జీతం తీసుకోను: రాజస్థాన్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

పేదల సంక్షేమమే లక్ష్యంగా ఓ జిల్లా కలెక్టర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలు పూర్తిగా అందేవరకు తాను జీతం స్వీకరించనని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో పాటు, తన ఆధ్వర్యంలోని అధికారులు కూడా ఈ అంశంపై సంపూర్ణ దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో ఆయన నిర్ణయం స్థానికంగా విస్తృత చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయం తీసుకున్నది రాజస్థాన్‌లోని రాజ్‌సమండ్‌ జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ హసిజా.

వివరాలు 

ప్రభుత్వం అందించే ప్రయోజనాలు తప్పకుండా వారికి చేరాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం: కలెక్టర్ 

పేదరికాన్ని తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు కీలక పథకాలు తన జిల్లాలోని ప్రతి అర్హుడికి చేరేలా చూస్తానని కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అరుణ్‌కుమార్‌ ప్రతిజ్ఞ చేశారు.ఈ పథకాల ప్రయోజనాలు అందరికీ అందే వరకు తన జీతాన్ని వదులుకోవాలని ఆయన నిర్ణయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మాకు జీతం పది రోజులు ఆలస్యమైనా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటప్పుడు పేదరికంలో జీవిస్తున్న వారు, చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న పిల్లలు, పని చేయలేని వికలాంగులు, వృద్ధులు ఎదుర్కొనే కష్టాలు మరింత తీవ్రమైనవే. పథకాల కోసం నమోదు చేసుకోవడానికే వారు ఎన్నో అవాంతరాలు పడుతున్నారు. అందుకే ప్రభుత్వం అందించే ప్రయోజనాలు తప్పకుండా వారికి చేరాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను" అని తెలిపారు.

వివరాలు 

రాజ్‌సమండ్‌ జిల్లాలో సుమారు 30 వేల మంది పేద ప్రజలు

అధికారిక లెక్కల ప్రకారం రాజ్‌సమండ్‌ జిల్లాలో సుమారు 30 వేల మంది పేద ప్రజలు ఉన్నారు. వీరి కోసం రాజస్థాన్‌ ప్రభుత్వం మూడు ప్రధాన సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే వివిధ కారణాల వల్ల అనేక మంది ఇప్పటివరకు వాటి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఆ పథకాలు ఇవి: 1. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఉచిత రేషన్ లేదా గోధుమల సరఫరా 2. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను 'పలన్హార్‌ యోజన'లో నమోదు చేసి సహాయం అందించడం 3. ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులకు పింఛన్ల పంపిణీ

Advertisement

వివరాలు 

పింఛన్ల పథకం కింద 1,90,440 మంది లబ్ధిదారుల పేర్ల నమోదు

కలెక్టర్‌ తీసుకున్న నిర్ణయంతో జిల్లా యంత్రాంగం వెంటనే చురుకుగా పనిచేయడం ప్రారంభించింది. పింఛన్ల పథకం కింద ఇప్పటికే జిల్లాలో 1,90,440 మంది లబ్ధిదారుల పేర్లను నమోదు చేశారు. పెండింగ్‌లో ఉన్న ధ్రువీకరణ ప్రక్రియలను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెలాఖరుకు మూడు పథకాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కారానికి అరుణ్‌కుమార్‌ వినూత్న నిర్ణయాలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ రైతులు, సామాన్య ప్రజలకు పథకాల అమలులో అనేక ముందడుగులు వేశారని అధికారులు పేర్కొన్నారు.

Advertisement