Loading...
Colorado Denver University: హైదరాబాద్‌లో కొలరాడో డెన్వర్‌ యూనివర్సిటీ.. 2027 ఆగస్టు నుంచి తరగతులు
హైదరాబాద్‌లో కొలరాడో డెన్వర్‌ యూనివర్సిటీ.. 2027 ఆగస్టు నుంచి తరగతులు

Colorado Denver University: హైదరాబాద్‌లో కొలరాడో డెన్వర్‌ యూనివర్సిటీ.. 2027 ఆగస్టు నుంచి తరగతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ విద్యా సంస్థకు వేదిక కానుంది. అమెరికాకు చెందిన ప్రభుత్వ విశ్వవిద్యాలయం కొలరాడో డెన్వర్‌ యూనివర్సిటీ (సీయూ డెన్వర్‌) భారత్‌లో తొలిసారిగా ఏర్పాటు చేయనున్న విదేశీ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనుంది. ఇందుకోసం యూనివర్సిటీ తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నుంచి లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ) పొందింది. దీంతో తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా క్యాంపస్‌ ఏర్పాటుకు అనుమతి పొందిన తొలి అమెరికన్‌ ప్రభుత్వ విశ్వవిద్యాలయంగా సీయూ డెన్వర్‌ నిలిచింది. 2027 ఆగస్టు నుంచి హైదరాబాద్‌ క్యాంపస్‌లో విద్యా తరగతులను ప్రారంభించేలా వర్సిటీ సన్నాహాలు చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు మెరుగైన విద్యా ఫలితాలు, ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది.

వివరాలు 

ఎమెరిటస్‌ వ్యూహాత్మక జాయింట్‌ వెంచర్

ముఖ్యంగా బిజినెస్‌, కంప్యూటింగ్‌, ఇంజినీరింగ్‌, అనలిటిక్స్‌ వంటి ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉన్న విభాగాల్లో కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది.

భారతీయ విద్యార్థులతో తమకు ఉన్న అనుబంధాన్ని హైదరాబాద్‌ క్యాంపస్‌ ద్వారా మరింత బలోపేతం చేసుకోనున్నట్లు సీయూ డెన్వర్‌ ఛాన్సలర్‌ కెన్నెత్‌ క్రిస్టెన్సెన్‌ తెలిపారు.

వివిధ రంగాల్లో యూనివర్సిటీకి ఉన్న ప్రత్యేక అనుభవాన్ని భారతీయ విద్యార్థులకు అందించే అవకాశం ఈ క్యాంపస్‌ ద్వారా లభించిందని ఆయన పేర్కొన్నారు.

భారత్‌లో సీయూ డెన్వర్‌కు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ఎమెరిటస్‌ వ్యూహాత్మక జాయింట్‌ వెంచర్‌ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యను భారతీయ విద్యార్థులకు చేరువ చేయడంలో ఈ భాగస్వామ్యం కీలకంగా ఉంటుందని ఎమెరిటస్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అశ్విన్‌ దామెరా తెలిపారు.

వివరాలు 

దేశంలో ఎక్కువగా యూకే, ఆస్ట్రేలియా వర్సిటీలే

యూజీసీ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో ఎనిమిది విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌ల ఏర్పాటుకు పూర్తిస్థాయి అనుమతులు పొందాయి.

వీటిలో ఇప్పటికే నాలుగు విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు తరగతులను ప్రారంభించాయి.

పూర్తిస్థాయి అనుమతులు పొందిన విదేశీ వర్సిటీల్లో నాలుగు మహారాష్ట్రలో ఉండగా.. కర్ణాటక, హరియాణాల్లో రెండేసి క్యాంపస్‌లు ఉన్నాయి.

ఇప్పటివరకు అనుమతులు పొందిన ఈ విశ్వవిద్యాలయాలన్నీ యూకే, ఆస్ట్రేలియాకు చెందినవే.

ఇదిలా ఉండగా.. మరో 11 విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రాథమిక అనుమతులు పొందాయి.

మరోవైపు హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌, బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయాలతోపాటు మరో నాలుగు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

ADVERTISEMENT