Mamata Banerjee : ఓపెన్ మైండ్‌తో చర్చలకు రండి.. మరోసారి వైద్యులను ఆహ్వానించిన మమతా బెనర్జీ
ఆర్‌జీ కర్ దవాఖాన ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఘటన అనంతరం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, జూనియర్ వైద్యుల మధ్య ఏర్పడిన ఘర్షణ ఇంకా కొనసాగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, ఇప్పుడు వైద్యులను మరోసారి చర్చలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సాయంత్రం 5 గంటలకు కాళీఘాట్‌లోని ఆమె నివాసంలో వైద్యులతో చర్చించేందుకు ఆహ్వానించారు. దీనికి సంబంధించి, బెంగాల్ చీఫ్ సెక్రటరీ వైద్యులకు ఒక లేఖను పంపించారు. ఇది చివరి ఆహ్వానం అని, ఓపెన్ మైండ్‌తో చర్చలకు రావాలని లేఖలో కోరారు.
కొన్ని షరతులను విధించిన బెంగాల్ ప్రభుత్వం
ఇప్పటికే నాలుగుసార్లు వైద్యులను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం, కొన్ని షరతులు కూడా విధించిన విషయం తెలిసిందే. వైద్యులు 15 మందితో ప్రతినిధుల బృందాన్ని అందుకు పంపాలని పేర్కొన్నారు. అయితే, వైద్యులు తమ ఆందోళనలపై చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించిన కారణంగా, వైద్యులు చర్చలకు హాజరుకాలేదు. వైద్యుల డిమాండ్లను తిరస్కరించిన నేపథ్యంలో, సీఎం మమతా బెనర్జీ ప్రజల సంక్షేమం కోసం తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు.