RTC: ఆర్టీసీపై ఏడు నెలల్లో 14వేలకు పైగా ఫిర్యాదుల వెల్లువ.. పంక్చువాలిటీ నుంచి సిబ్బంది ప్రవర్తన వరకు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టీసీ సేవలపై ప్రయాణికుల అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది. బస్సుల పంక్చువాలిటీ లోపించడం మాత్రమే కాకుండా డ్రైవర్లు, కండక్టర్ల ప్రవర్తన కూడా సరిగా లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రావాల్సిన బస్సులు రానట్లు, రానివి వస్తున్నట్లుగా చూపించే 'గమ్యం' ట్రాకింగ్ వ్యవస్థతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. దీనితో పాటు బస్సుల్లో పరిశుభ్రత లేకపోవడం, మధ్యలోనే రోడ్లపై బస్సులు ఆగిపోవడం వంటి సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు కేవలం ఏడు నెలల్లోనే మొత్తం 14,054 ఫిర్యాదులు అందినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదులన్నింటినీ ప్రస్తుతం సంస్థ విశ్లేషిస్తోంది.
వివరాలు
డ్రైవర్లు, కండక్టర్ల ప్రవర్తనపై కూడా తీవ్ర అభ్యంతరాలు
సమయానికి బస్సులు రాకపోవడం వల్ల ఉద్యోగులు, విద్యార్థులు,ఆసుపత్రులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు బస్సు వచ్చినా దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు తిరిగి ఎప్పుడు బయలుదేరుతాయో స్పష్టత లేకపోవడంతో ప్రయాణికులు గందరగోళంలో పడుతున్నారు. మరోవైపు సీట్ల మధ్య తక్కువ ఖాళీ ఉండటం, బస్సుల లోపల దుమ్ము పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉండటం వంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. పంక్చువాలిటీ సమస్యతో పాటు డ్రైవర్లు, కండక్టర్ల ప్రవర్తనపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికులతో మర్యాదగా మాట్లాడకపోవడం, సరిగా స్పందించకపోవడం వంటి అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో, ప్రయాణికులతో సౌమ్యంగా వ్యవహరించాలని ఆర్టీసీ యాజమాన్యం కొన్ని వారాల క్రితమే డ్రైవర్లు, కండక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
వివరాలు
ప్రమాదకర డ్రైవింగ్‌పై కూడా ఆందోళన
నిర్వహణ లోపాల కారణంగా కొన్ని బస్సులు ప్రయాణం మధ్యలోనే రోడ్లపై నిలిచిపోతున్నాయి. మరమ్మతులు పూర్తయ్యేంతవరకు లేదా మరో బస్సు వచ్చేంతవరకు ప్రయాణికులు అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీంతో సమయం వృథా కావడమే కాకుండా తీవ్ర అసౌకర్యం ఎదురవుతోందని వారు వాపోతున్నారు. ప్రమాదకర డ్రైవింగ్‌పై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరు డ్రైవర్లు బస్సులను నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా నడుపుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. మరికొందరు డ్రైవింగ్ చేస్తూనే ఒక చేత్తో స్టీరింగ్ తిప్పుతూ మరో చేత్తో సెల్‌ఫోన్ వాడటం, ఇయర్‌ఫోన్లు లేదా బ్లూటూత్ పరికరాలు పెట్టుకుని బస్సులు నడపడం ప్రమాదాలకు దారితీస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు.
వివరాలు
ఖమ్మం డిపోపై అత్యధికంగా ఫిర్యాదులు
అల్పాహారం, భోజన విరామం కోసం నిర్ణయించిన బస్టాండ్లలోని హోటళ్లకు వెళ్లాల్సి ఉండగా, కొందరు డ్రైవర్లు తమకు నచ్చిన దాబాలు, హోటళ్ల వద్దే బస్సులు ఆపుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో కొద్ది దూరంలోనే ప్రధాన పట్టణాల స్టాపులు ఉండటంతో అక్కడ కూడా బస్సులు ఆపాల్సిన పరిస్థితి ఏర్పడి, ప్రయాణికులు మరింత ఇబ్బంది పడుతున్నారు. డిపోల వారీగా చూస్తే ఖమ్మం డిపోపై అత్యధికంగా ఫిర్యాదులు నమోదైనట్లు సమాచారం. ఇక్కడ ఐదొందలకుపైగా ఫిర్యాదులు రాగా,రెండో స్థానంలో వరంగల్-1 డిపో నిలిచింది. అక్కడ నాలుగొందలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి.అనంతరం నిర్మల్,మంచిర్యాల,గోదావరిఖని, సత్తుపల్లి,భద్రాచలం,కరీంనగర్-2, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్-1, నిజామాబాద్-2, బోధన్, మణుగూరు, కోరుట్ల, వేములవాడ, భూపాలపల్లి, ఆర్మూర్, కొత్తగూడెం, మధిర తదితర డిపోలపై కూడా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు నమోదయ్యాయి.