UPI Charges: అమెరికా ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలొగ్గుతోందా?: యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్
ఈ వార్తాకథనం ఏంటి
రూ.2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. రూ.2వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఫీజులు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా మార్గం సుగమం చేస్తోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను బుజ్జగించేందుకే ఈ చర్యలు చేపడుతున్నారా? అని వారు ప్రశ్నించారు.
వివరాలు
రూ.2వేలు దాటిన లావాదేవీలే విలువలో 65 శాతం
దేశంలో రూ.2వేలు దాటిన యూపీఐ లావాదేవీలు సంఖ్యాపరంగా కేవలం 5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ.. మొత్తం లావాదేవీల విలువలో వాటి వాటా దాదాపు 65 శాతం ఉంటుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
భారత్‌లో అమల్లో ఉన్న జీరో ఎండీఆర్ (MDR) విధానాన్ని అమెరికా పేమెంట్ కంపెనీలు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.
ఆ సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం విధానాలను మార్చుకుంటోందని విమర్శించారు.
వివరాలు
అమెరికా ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలొగ్గుతోందా?
అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీ ఇప్పటికే రాజీపడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
ఇప్పుడు మరోసారి అమెరికా ఒత్తిడికి ప్రభుత్వం లొంగిపోతోందని విమర్శించారు.
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్న పరిస్థితుల్లో.. డిజిటల్ చెల్లింపులపై పన్ను విధించడం ద్వారా ప్రజల మిగిలిన పొదుపును కూడా దెబ్బతీయాలని ప్రభుత్వం చూస్తోందా? అని ప్రశ్నించారు.
వివరాలు
పెద్ద నోట్ల రద్దును గుర్తుచేసిన కాంగ్రెస్
దాదాపు పదేళ్ల క్రితం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
ఆ నిర్ణయం వల్ల కలిగే ప్రతికూల పరిణామాలపై ప్రశ్నలు వచ్చినప్పుడు.. డిజిటల్ చెల్లింపులను, నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకే నోట్ల రద్దు చేపట్టామని ప్రభుత్వం సమర్థించిందని గుర్తుచేశారు.
వివరాలు
రూ.5వేలకు రూ.25.. రూ.10వేలకు రూ.50 పన్నా?
రూ.5వేల లావాదేవీలపై రూ.25, రూ.10వేల లావాదేవీలపై రూ.50 వరకు పన్ను విధించే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఈ వార్తల్లో నిజమెంత? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎండీఆర్ ద్వారా వ్యాపారులపై పడే అదనపు భారం చివరికి వస్తువులు, సేవల ధరలు పెరగడం రూపంలో సగటు వినియోగదారుడిపైనే పడుతుందని ప్రభుత్వం గ్రహించడం లేదా? అని నిలదీశారు.
''ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం.. వారి జేబులను మరింత ఖాళీ చేసే కొత్త మార్గాలను ప్రతిరోజూ అన్వేషిస్తోంది. యూపీఐ చెల్లింపులపై ఫీజుల విధింపు ప్రతిపాదన కూడా అదే కోవలోకి వస్తుంది'' అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.