
Gurugram violence: హర్యానాలో 116మంది అరెస్టు; హింస వ్యాపించకుండా దిల్లీ అప్రమత్తం
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాలోని నుహ్ ప్రాంతంలో సోమవారం మతపరమైన ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య హింస చెలరేగిన విషయం తెలిసిందే.
నుహ్‌లో ప్రారంభమైన హింస, ఆ తర్వాత సోహ్నాకు, అనంతరం గురుగ్రామ్‌కు వ్యాపించింది.
తాజాగా దిల్లీకి కూడా హింస అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో అక్కడి యంత్రాంగం అప్రమత్తమైంది.
నుహ్-సోహ్నా-గురుగ్రామ్ మూడు ప్రాంతాల్లో చెలరేగిన హింస కారణంగా ఐదుగురు మరణించారు.
నూహ్‌లో ఇద్దరు హోంగార్డులతో సహా నలుగురు మరణించారు. గురుగ్రామ్‌లోని ఓ మసీదు వద్ద నాయబ్ ఇమామ్‌ను హత్య చేశారు.
అల్లర్ల నేపథ్యంలో హర్యానా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నాటికి మొత్త 116మంది పోలీసులు అరెస్టు చేశారు. 29 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
హర్యానా
పెట్రోల్ అమ్మకాలపై ఆంక్షలు
ఇదిలా ఉండగా, మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లో తాజాగా చెలరేగిన హింస నేపథ్యంలో సోహ్నా సబ్-డివిజన్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను బుధవారం మూసివేయాలని ఆదేశించారు.
మతపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో గురుగ్రామ్ జిల్లా మేజిస్ట్రేట్ జిల్లా అంతటా ఇంధన స్టేషన్లలో వాహనాకలు మినహా, విడిగా డీజిల్, పెట్రోల్ అమ్మకాలను నిషేధించారు.
హర్యానాలోని గురుగ్రామ్, పరిసర ప్రాంతాలలో మత ఘర్షణల నేపథ్యంలో అప్రమత్తమైన తరువాత దిల్లీ పోలీసులు మంగళవారం దేశ రాజధానిలో పెట్రోలింగ్‌ను నిర్వహించారు.
పొరుగు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం వల్ల దేశ రాజధానిలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
హర్యానా
ఇది కుట్రే, అల్లరి మూకలను విడిచిపెట్టేదు: సీఎం ఖట్టర్
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుహ్ హింసను కుట్రగా అభివర్ణించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా సీఎం హెచ్చరించారు. అల్లరి మూకలను విడిచిపెట్టేది లేదన్నారు.
హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా మతపరమైన ఊరేగింపును నిర్వహించిన వారి వల్లే ఈ హింసకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరేగింపుకు సంబంధంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదన్నారు. సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం ఇంత ఘోరం జరిగినట్లు చెప్పారు.
హింసలో మరణించిన హోంగార్డుల కుటుంబాలకు 57 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను హర్యానా పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది.
హర్యానా
అల్లర్లకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్
మేవాత్-నూహ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) బుధవారం నిరసనకు పిలుపునిచ్చింది.
మనేసర్‌లోని భీసం దాస్ మందిర్‌లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాపంచాయత్‌కు వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ సంయుక్తంగా పిలుపునిచ్చాయి.
దిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడాలో బుధవారం అల్లర్లకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహిస్తామని వీహెచ్‌పీ ప్రచార చీఫ్ రాహుల్ దూబే తెలిపారు. అక్కడ దిష్టిబొమ్మను దహనం చేస్తామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో నుహ్-సోహ్నా-గురుగ్రామ్ ప్రాంతాల్లో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు 20 కంపెనీల పారామిలటరీ బలగాలను ప్రభుత్వం మోహరించింది.
ఫరీదాబాద్, పల్వాల్, గురుగ్రామ్‌లలో ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించారు.