కాంగ్రెస్ కీలక ప్రకటన ; దిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయం
బెంగళూరులో సోమవారం విపక్ష నేతల రెండో భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన దిల్లీ ఆర్డినెన్స్‌కు తాము వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆప్ పార్టీ పోరాటానికి మద్ధతు పలికింది. దేశ రాజధాని ప్రాంతం దిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం ఆర్డినెన్స్ మే 19న ఆర్డినెన్స్ తెచ్చింది. దీనికి తాము మద్దతివ్వబోమని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే సమావేశంలో ఆప్ భాగస్వామ్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ఆప్ న్యాయ పోరాటం
దిల్లీలో బదిలీలు, నియామకాల విషయంలో కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోంది. ఈ సందర్భంగా సదరు ఆర్డినెన్స్‌పై రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ కేజ్రీవాల్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు పిటిషన్‌పై కేంద్రం తమ వైఖరిని తెలియజేయాలని కోరిన సర్వోన్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఇదే పిటిషన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్‌ని ప్రతివాదిగా చేర్చాలని దిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసులో తదుపరి విచారణ సోమవారం జరగనుంది.