యమునా వరదలపై ఆప్ సంచలన ఆరోపణలు.. బీజేపీ కుట్రే అంటున్న కేజ్రీవాల్ సర్కార్
దిల్లీని వరదలు ముంచేస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. యమునా వరదలు బీజేపీ సృష్టి అంటూ ఆప్ ప్రభుత్వం బాంబ్ పేల్చింది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి దిల్లీలోని యమునా నదీలోకి అదనపు వరద నీటిని విడుదల చేశారు. దీంతో దేశ రాజధాని వీధులన్నీ యమునా వరదలతో నీట మునిగాయి. బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడం కుట్రలో భాగంగానే జరిగినట్లు ఆప్ వాదిస్తోంది. యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయిలో 208.66 మీటర్లకు చేరుకొని 45ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. దీంతో దిల్లీ మహానగర వాసులు బెంబెలిత్తిపోయారు.
పశ్చిమ కాలువకు, యూపీలోని తూర్పు కాలువకు నీరు విడుదల చేయలేదు : ఆప్
హత్నికుండ్ నుంచి హర్యానాలోని పశ్చిమ కాలువకు గానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని తూర్పు కాలువకు గానీ నీరు విడుదల చేయకుండా దిల్లీ కాలువకు మాత్రమే నీటిని వదలడంపై ఆప్ అనుమానం వ్యక్తం చేస్తోంది. రాజధానిని ఉద్దేశపూర్వకంగానే ముంచేశారని దిల్లీ నీటిపారుదల, వరద నిర్వహణశాఖ మంత్రి సౌరభ్ బరద్వాజ్ ఆరోపించారు. హత్నికుండ్ బ్యారేజీ నుంచి వరద మొత్తాన్ని కేవలం దిల్లీకి మాత్రమే విడుదల చేశారని విమర్శించారు. పర్యానా వరద నీరు దిల్లీలో దీనస్థితికి కారణమైందని మండిపడ్డారు. కొవిడ్ సమయంలోనూ కేంద్రం దిల్లీ సర్కారును నిందించేందుకు కుట్రలు చేసిందని గుర్తుచేశారు. వర్షాలు క్రమంగా తగ్గుతుండటంతో యమునా సాధారణ స్థితికి చేరుకుంటోంది. మరో 12 గంటల్లోగా పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని మరో మంత్రి అతిషి పేర్కొన్నారు.