Karti Chidambaram:వారానికి 4 రోజుల పనే.. నారాయణ మూర్తి '70 పని గంటలకు ఎంపీ కార్తీ చిదంబరం కౌంటర్
భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. ఇటీవల ఆయన ఈ అంశంపై మరింతగా వివరణ ఇచ్చారు. ''భారత్ ఐదు రోజుల పని పద్ధతికి మారాలని నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. నేను వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌లో విశ్వసించను. ప్రస్తుత పరిస్థితుల్లో విశ్రాంతి అవసరం కాదని, భారతీయులు త్యాగాలు చేయాలి'' అని పేర్కొన్నారు. ఆయన ప్రతిరోజు ఉదయం 6.30 గంటలకు ఆఫీసుకు వెళ్లి రాత్రి 8.40 గంటలకు తిరిగి వస్తానని, వారానికి ఆరున్నర రోజులు పనిచేస్తానని చెప్పారు.
మనం వారానికి 4 రోజులు పనిచేయడం మంచిది: కార్తీ చిదంబరం
ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందిస్తూ, సుదీర్ఘంగా పని చేయడం అనేది అర్థరహితం కాదని, దానికన్నా సమర్థతపై దృష్టి పెట్టడం అవసరమని తెలిపారు. ''మన దేశంలో ఉద్యోగుల రోజు-ప్రతి జీవితం ఒక పోరాటమే. అసమర్థమైన మౌలిక సదుపాయాలను ఎదుర్కొంటూ మనం కొనసాగుతున్నాం. మంచి సామాజిక వాతావరణం, సామరస్య స్థితి కోసం వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యమని'' అన్నారు. ''మనం వారానికి 4 రోజులు పనిచేయడం మంచిది'' అని కాంగ్రెస్ ఎంపీ వివరించారు.
అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడాలంటే.. 70 గంటలు పనిచేయాలి
ఇదిలా ఉంటే, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యానించిన 'ది రికార్డ్' పాడ్‌కాస్ట్‌లో నారాయణమూర్తి, ''ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువగా ఉంది. అందుకే దేశ యువతకు మరిన్ని గంటలు పని చేయాలని'' అన్నారు. ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ''జపాన్, జర్మనీ వంటి దేశాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎంత కష్టపడ్డాయో, మనం కూడా అలాగే శ్రమించాలి'' అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడాలంటే భారత యువత 70 గంటలు పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై మిశ్రమ స్పందనలు రావడం గమనార్హం.