VD Satheesan: 10 రోజుల ఉత్కంఠకు తెర.. కేరళ సీఎంగా వీడీ సతీశన్ ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగిన ఉత్కంఠకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది. సీనియర్ కాంగ్రెస్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వీడీ సతీశన్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. యూడీఎఫ్ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత దాదాపు 10 రోజుల పాటు మంతనాలు కొనసాగాయి. చివరకు పార్టీ అధిష్ఠానం సతీశన్ వైపు మొగ్గు చూపింది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సతీశన్‌కు రాష్ట్రంలో మంచి ప్రజాదరణ ఉంది. సీఎం రేసులో కే.సీ. వేణుగోపాల్, రమేశ్ చెన్నితల పేర్లు కూడా బలంగా వినిపించినప్పటికీ.. చివరకు కాంగ్రెస్ అధిష్ఠానం సతీశన్‌కే అవకాశం ఇచ్చింది. గత కొన్ని రోజులుగా కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు, లాబీయింగ్ తీవ్రంగా సాగింది.
వివరాలు
సీఎల్పీ నేతగా వీడీ సతీశన్
మే 7న తిరువనంతపురంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. కొత్త సీఎల్పీ నాయకుడిని ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడికి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు కాంగ్రెస్ నేత దీపా దాస్ మున్షీ ఢిల్లీలో ప్రకటించారు. అనంతరం వీడీ సతీశన్‌ను సీఎల్పీ నేతగా నియమించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్‌కు మద్దతుగా ఉన్నారనే ప్రచారం జరిగినా.. గత ఐదేళ్లుగా పార్టీ ప్రధాన ముఖచిత్రంగా నిలిచిన సతీశన్‌కే ప్రజల్లో ఎక్కువ ఆదరణ కనిపించింది.
వివరాలు
యూడీఎఫ్‌కు 102 సీట్ల భారీ విజయం
2021 ఎన్నికల పరాజయం తర్వాత పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. యూడీఎఫ్‌కు 102 సీట్ల భారీ విజయాన్ని అందించిన వ్యూహకర్తగా కూడా సతీశన్‌కు క్రెడిట్ దక్కింది. సీఎం పదవిపై ముగ్గురు నేతలు పట్టుదలగా ఉన్నప్పటికీ.. చివరకు పార్టీ పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో సతీశన్ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.