కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు జరిగే పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గైర్హాజరు కావడం గమనార్హం. మూడు రోజుల సెషన్‌లో భాగంగా మొదటిరోజు పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికను ప్రాథమికంగా ఆమోదించి, ఆయన నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. అనంతరం సీడబ్య్లూసీకి ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. కొత్త సీడబ్య్లూసీ కమిటీ ఏర్పడే వరకు వర్కింగ్ కమిటీ పాత్రను స్టీరింగ్ కమిటీ పోషిస్తుంది. సాయంత్రం 4గంటలకు సబ్జెక్టుల కమిటీ సమావేశం అవుతుంది. ఈ సందర్భంగా పలు తీర్మానాలను రూపొందిచంనున్నారు.
ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై అధిష్ఠానం ఫోకస్
ఈ ఏడాది కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు పరీక్షగా మారాయి. అలాగే 2024లో సార్వత్రిక ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ప్లీనరీలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించిన స్పష్టమైన రోడ్‌మ్యాప్‌పై అధిష్ఠానం ఫోకస్ పెట్టనుంది. బీజేపీని ఎదుర్కోవడానికి భావసారూప్యత గల పార్టీలతో ఎన్నికల పొత్తు పెట్టుకునే వ్యూహాన్ని ఖరారు చేయాలని కాంగ్రెస్ నాయక్వతం భావిస్తోంది. ఫిబ్రవరి 26న మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రసంగం ఉంటుంది. ఆరోజు సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ అనంతరం ప్లీనరీ ముగుస్తుంది.