ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది?
ఫిబ్రవరి 24నుంచి 26వరకు నయా రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే నియామకాన్ని ఆమోదించనున్నారు. ప్లీనరీలోనే కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని కూడా ఎన్నుకోనున్నారు. అయితే సీడబ్ల్యూసీని ఎలా ఏర్పాటు చేస్తారనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్త అధ్యక్షుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని మొత్తాన్నినేరుగా నియమిస్తారా? లేకుంటే పాత సంప్రదాయాన్నేకొనసాగిస్తారా? అని కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నారు. సీడబ్ల్యూసీలో పార్టీ అధ్యక్షుడితో సహా 25 మంది సభ్యులుంటారు. పన్నెండు మందిని పార్టీ చీఫ్ నామినేట్ చేస్తారు. మిగిలిన 12 మందిని ఏఐసీసీ సభ్యులు ఎన్నుకుంటారు.
కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ, ప్లీనరీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
రాయ్‌పూర్‌లో జరిగే ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు. ఏఐసీసీ సభ్యులను ఆరు గ్రూపులుగా విభజించి, ఒక్కో విభాగానికి ఒక్కో బాధ్యతను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించి ప్లీనరీలో తీర్మానం చేయనున్నారు. అలాగే సీడబ్ల్యూసీ ఎన్నికల విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు పరీక్షగా మారాయి. ఎన్నికలు జరగనున్న రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్లీనరీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.