PM Modi-Congress: మోదీపై కాంగ్రెస్ మరో వివాదాస్పద వీడియో.. రెడ్ కార్పెట్ పై చాయ్ అమ్ముతున్న ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన రెండు రోజుల పాటు దేశంలో పర్యటించనున్నారు. పుతిన్ పర్యటన విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ- పుతిన్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో, పర్యటనకు తగిన విధంగా భారత్ అన్ని ఏర్పాట్లను సముచితంగా నిర్వహిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక వివాదాస్పద ఏఐ వీడియోను విడుదల చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతూ దుమారం రేపుతోంది.
వివరాలు
ఇప్పుడు… ఇది ఎవరు చేశారు?
భారత్ పుతిన్ స్వాగతార్థం రెడ్ కార్పెట్ ఏర్పాటు చేసినట్టుగా చూపిస్తూ, ఆ రెడ్ కార్పెట్ మీద ప్రధాని మోదీ టీ విక్రయిస్తున్నట్టుగా రూపొందించిన ఏఐ వీడియోను కాంగ్రెస్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోపై బీజేపీ ఘాటుగా స్పందించింది.ప్రధాని వ్యక్తిత్వాన్ని అవమానించేలా కాంగ్రెస్ మరోసారి వ్యవహరించిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వివాదాస్పద వీడియోను కాంగ్రెస్ నాయకురాలు రాగిణి నాయిక్ తన 'ఎక్స్' అకౌంట్‌లో "ఇప్పుడు... ఇది ఎవరు చేశారు?" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. వీడియోలో ప్రధాని మోదీ లేత నీలం రంగు కోటు,నల్ల ప్యాంటును ధరించి,చేతిలో కెటిల్,టీ గ్లాసులతో రెడ్ కార్పెట్‌పై నిలబడి పిలుస్తున్నట్లు చూపించారు.
వివరాలు
చాయ్ బోలో… చాయ్యే
చుట్టూ అంతర్జాతీయ జెండాలు, భారత త్రివర్ణ పతాకం కూడా కనిపిస్తున్నాయి. అలాగే వీడియోలో ''చాయ్ బోలో... చాయ్యే (ఎవరికైనా టీ కావాలా?)'' అంటూ మోడీ అరుస్తున్నట్టుగా గొంతు వినిపిస్తోంది. ఇంతకుముందు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహా ఏఐ వీడియోను కాంగ్రెస్ రూపొందించింది. ఆ వీడియోలో ప్రధాని మోదీ భారీగా ఓట్ల దోపిడీ చేశానంటూ మంచంపై పడుకున్నట్టు చూపించి, అనంతరం ఆయన తల్లి హీరాబెన్ కలలో ప్రత్యక్షమై ఓట్ల మోసం విషయమై మోదీని మందలించినట్టు చిత్రీకరించారు.
వివరాలు
బీజేపీ తీవ్ర ఆగ్రహం
ఆ వీడియో అప్పట్లో కూడా పెద్ద దుమారం రేపింది. ఇప్పుడు తాజాగా పుతిన్ భారత పర్యటన సమయానికి మళ్లీ ఇటువంటి ఏఐ వీడియోను కాంగ్రెస్ విడుదల చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాని ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతోందని కమలనాథులు ఘాటైన విమర్శలు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంగ్రెస్ పార్టీ వివాదాస్పద ఏఐ వీడియో ఇదే..
अब ई कौन किया बे 🥴🤣 pic.twitter.com/mbVsykXEgm
— Dr. Ragini Nayak (@NayakRagini) December 2, 2025