Page Loader
Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. ఐదు గ్యారెంటీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్ 
దిల్లీ ఎన్నికలు.. ఐదు గ్యారెంటీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్

Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. ఐదు గ్యారెంటీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, దిల్లీలోని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా, కాంగ్రెస్ తాజాగా ఐదు గ్యారెంటీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు, మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సహాయం ప్రకటించింది. దిల్లీ ప్రజలకు 'అందరికీ ఆరోగ్యం' పథకం కింద రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా, మెహంగై ముక్తి యోజన కింద ఒక్కో సిలిండర్‌ను రూ.500కు అందించడంతో పాటు ఉచిత రేషన్ కిట్‌ను అందించనుంది. సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, పేదలకు నెలకు రూ.5,000 పెన్షన్‌ను ప్రకటించింది.

వివరాలు 

మ్యానిఫెస్టో విడుదల చేసిన జైరాం రమేశ్,దేవేంద్ర యాదవ్

యువతకు ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో ఏడాది అప్రెంటీస్‌షిప్‌తో పాటు నెలకు రూ.8,500 స్టైఫండ్ అందిస్తామని హామీ ఇచ్చింది. 'ప్యారీ దీదీ' పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సహాయం అందించనుంది. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఈ మ్యానిఫెస్టోలో ముఖ్యమైన హామీగా ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్, పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ బుధవారం ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.

వివరాలు 

ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రచారం

ఈ సందర్భంగా జైరాం రమేశ్ మాట్లాడుతూ, 'దిల్లీ ప్రజల కోసం ఐదు గ్యారెంటీలు ప్రకటించాం. గ్యారెంటీ అంటే ప్రజల హక్కు. ఆప్, భాజపా దిల్లీ కాలుష్యాన్ని నివారించడంలో విఫలమయ్యాయి' అని విమర్శించారు. అలాగే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని, పూర్వాంచల్ ప్రజల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని దేవేంద్ర యాదవ్ ప్రకటించారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగనున్నాయి. ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.