PM Modi: అభివృద్ధిని చూసి 'ఇండియా' కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదు: ప్రధాని మోదీ
హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన కార్యక్రమంలో రూ.లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వ అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్‌కు, 'ఇండియా' కూటమి నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు. 2024లో ఇప్పటి వరకు రూ.10 లక్షల కోట్లతో ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామన్నారు. దేశంలో జరుగుతున్న లక్షల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల వల్ల కాంగ్రెస్, ఇండియా కూటమి అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయన్నాని మోదీ అన్నారు. నిద్రలేమి సమస్యతో వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
దేశంలో చాలా మారినా.. వాళ్లు మాత్రమే మారలేదు: మోదీ
పదేళ్లలో దేశం చాలా మారిపోయింది కానీ కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు మాత్రం మారలేదని మోదీ ఎద్దేవా చేశారు. 2024 నుంచి మూడు నెలలు కూడా గడవలేదని, ఇంత తక్కువ సమయంలోనే రూ.10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామన్నారు. ఇవి తాను స్వయంగా పాల్గొన్న ప్రాజెక్ట్‌లు మాత్రమేనని చెప్పారు. అంతే కాకుండా తమ పార్టీ ముఖ్యమంత్రులు, మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మరిన్ని చేశారన్నారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్, 112 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించడం దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక మైలురాయి అని మోదీ అన్నారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే దిల్లీ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని ఆయన అన్నారు.