
Polavaram: స్పిల్‌వే రక్షణకు కొత్త గైడ్‌బండ్ నిర్మాణం అవసరం.. పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల బృందం సిఫార్సు
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే రక్షణ కోసం,అలాగే నీటి ప్రవాహ సమస్యలను నివారించేందుకు నిర్మించిన గైడ్‌బండ్ తీవ్రంగా దెబ్బతింది. ఈ కారణంగా అక్కడ కొత్త గైడ్‌బండ్ నిర్మాణం అవసరం ఏర్పడింది.ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విదేశీ నిపుణుల బృందం,ఈ సమస్యపై అత్యవసరంగా ఒక వర్క్‌షాప్ నిర్వహించాలని సూచించింది. గైడ్‌బండ్ నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన కట్ ఆఫ్ వాల్ ధ్వంసమవడంతో గైడ్‌బండ్ కుంగిపోయింది. తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా,ప్రస్తుత కట్టడం శాశ్వత పరిష్కారం కాదని నిపుణులు తెలిపారు. అందువల్ల కొత్తగా గైడ్‌బండ్ నిర్మించాలని వారు ప్రతిపాదించారు.ఈ పనులన్నీ 2027 డిసెంబరు లోపు పూర్తిచేయాల్సి ఉంటుందని కూడా స్పష్టంచేశారు.
వివరాలు
2023 జూన్‌లో కుంగిన గైడ్‌బండ్
పుణెలోని పరిశోధనా కేంద్రంలో రూపొందించిన స్పిల్‌వే 3డీ నమూనా ఆధారంగా చేసిన అధ్యయనాల్లో,స్పిల్‌వే ఎడమ వైపున నీటి ప్రవాహంలో సుడిగుండాలు ఉన్నట్లు తేలింది. ఇవి డ్యాం నిర్మాణానికి ప్రమాదకరమని భావించి ప్రత్యామ్నాయంగా గైడ్‌బండ్ నిర్మాణం అవసరమని సూచించారు. ఈ గైడ్‌బండ్ నిర్మాణానికి గతంలో సుమారు రూ.83 కోట్లు ఖర్చు చేశారు. 2021 నుండి 2023 మధ్య ఈ నిర్మాణం చేపట్టారు. అయితే, 2023 జూన్‌లో గైడ్‌బండ్ కుంగిపోవడంతో సమస్య బయటపడింది. ఆ సమయంలోనే కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ పాండ్యా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికలో గైడ్‌బండ్‌ను తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొంది.
వివరాలు
డయాఫ్రం వాల్ లోపమే ప్రధాన కారణం
గైడ్‌బండ్‌లో భాగంగా నిర్మించిన డయాఫ్రం వాల్(కట్ ఆఫ్ వాల్)డిజైన్‌లో లోపాలు ఉండటం వల్లే ఈ సమస్య ఏర్పడిందని నిపుణులు తేల్చారు. తాత్కాలికంగా బట్రస్ డ్యాం తరహాలో కొన్నిఅడ్డుకట్టలు వేసినా అవి సరైన బలం ఇవ్వలేకపోయాయి. దీంతో ప్రస్తుత గైడ్‌బండ్ పైభాగంలో కొత్త కట్టడం నిర్మించే ఆలోచన మొదలైంది.తాజాగా పోలవరం సందర్శించిన విదేశీ నిపుణుల బృందం కూడా పాత గైడ్‌బండ్ డిజైన్ సరిగా లేదని అభిప్రాయపడింది. ఆర్‌సీ డయాఫ్రం వాల్ ప్యానళ్లు సరిగా అనుసంధానం చేయకపోవడం వల్ల గైడ్‌బండ్ వంగిపోయిందని వారు పేర్కొన్నారు. 0.60మీటర్ల నుంచి 11.98మీటర్ల వరకు వంగుదల ఏర్పడటమే గైడ్‌బండ్ కుంగిపోవడానికి ప్రధాన కారణమని తేలింది. అలాగే,మొత్తం 105ఆర్‌సీసీ కట్ ఆఫ్ వాల్ ప్యానళ్లలో 42ప్యానళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు అధ్యయనాల్లో బయటపడింది.