Page Loader
IAF:"ఒప్పందాలు సంతకం చేస్తారు,డెలివరీలు మాత్రం పూర్తి చేయరు": వాయుసేన చీఫ్‌ అసంతృప్తి
ఒప్పందాలు సంతకం చేస్తారు,డెలివరీలు మాత్రం పూర్తి చేయరు: వాయుసేన చీఫ్‌ అసంతృప్తి

IAF:"ఒప్పందాలు సంతకం చేస్తారు,డెలివరీలు మాత్రం పూర్తి చేయరు": వాయుసేన చీఫ్‌ అసంతృప్తి

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రక్షణరంగంలో ప్రధాన ఒప్పందాలు కుదురుతున్నా,ఆయుధ వ్యవస్థల సరఫరాలు మాత్రం ఆరంభం కావడం లేదని భారత వాయుసేన అధిపతి ఎయిర్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఐఐ వార్షికసమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "తరచూ ఒప్పందాలు కుదురుతున్నాయని చూస్తున్నాం.కానీ ఆయుధాలు,వ్యవస్థలు సరైన సమయానికి అందడం లేదు.గడువు సమస్య ప్రధానంగా ఉంది.సకాలంలో పూర్తయిన ఒక్క ప్రాజెక్టు కూడా నాకు గుర్తుండటం లేదు.మనం చేయలేని పనుల గురించి హామీలు ఇవ్వడం ఎందుకు? తేజస్‌ ఎంకే1 ప్రాజెక్టు చాలా ఆలస్యమైంది.ఇక తేజస్‌ ఎంకే2 ప్రొటోటైప్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆమ్కా ఫైటర్‌కు సంబంధించి ఇప్పటికీ నమూనా విమానం సిద్ధం కాలేదు"అని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

విశ్వాసం, పారదర్శకత అవసరం 

వాయుసేన, పరిశ్రమల మధ్య పరస్పర నమ్మకాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా పారదర్శకత కీలకమని ఎయిర్‌ మార్షల్‌ పేర్కొన్నారు. "ఏదైనా ప్రాజెక్టును ఒకసారి తీసుకుంటే, దానిని పూర్తి చేయాల్సిందే. మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధన కోసం వాయుసేన తీవ్రంగా కృషి చేస్తోంది" అన్నారు. భద్రతాపరంగా మనం ఈ రోజు సిద్ధంగా ఉంటేనే రేపటి అవసరాలకు తగిన విధంగా సన్నద్ధం కావచ్చని అభిప్రాయపడ్డారు. "రానున్న 10 ఏళ్లలో మన దేశీయ పరిశ్రమలు ఉత్పత్తిని భారీగా పెంచగలవు. కానీ ప్రస్తుతానికి వేగంగా చర్యలు తీసుకోవాలి. దళాలను సమర్థవంతంగా తయారుచేసుకున్నప్పుడే యుద్ధాల్లో విజయం సాధించగలుగుతాం" అని హితవు పలికారు.

వివరాలు 

యుద్ధ రంగంలో వేగంగా మారుతున్న టెక్నాలజీ 

యుద్ధ రంగంలో ప్రతి రోజు సాంకేతిక పరిజ్ఞానం కొత్త దశల్లోకి వెళ్తుందని ఆయన అన్నారు. "మన నౌకాదళాధిపతులు చెప్పినట్లే, యుద్ధ సాంకేతికతలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిరోజూ కొత్త టెక్నాలజీలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ మన పరిస్థితి ఏంటి, భవిష్యత్తుకు ఏం కావాలి అన్న విషయాల్లో స్పష్టత తీసుకొచ్చింది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది" అని వివరించారు.

వివరాలు 

ఆమ్కా ప్రాజెక్టు - ప్రైవేటు రంగానికి అవకాశం 

ఆమ్కా ప్రాజెక్టును ప్రైవేటురంగానికి కూడా తెరిచినట్లు ఎయిర్‌ మార్షల్‌ వెల్లడించారు. ఇది ఎంతో ప్రాధాన్యత కలిగిన నిర్ణయమని,దేశం ప్రైవేటు రంగంపై ఎంత విశ్వాసంతో ఉందో దీనివల్ల స్పష్టమవుతుందని అన్నారు.భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ద్వారా కీలకమైన మార్పులకు దారి తీయవచ్చని విశ్లేషించారు. తేజస్‌ డెలివరీలపై తీవ్ర అసంతృప్తి ఇది తొలిసారి కాదు.ఈ ఏడాది జనవరిలో కూడా తేజస్‌ డెలివరీపై ఎయిర్‌ చీఫ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "తయారీ సంస్థలు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల్లో పెట్టుబడులు పెట్టాలి.వారి మానవ వనరులను మరింత నైపుణ్యం కలిగించినవిగా తీర్చిదిద్దాలి.తేజస్‌ తొలి విమానం 2001లో గాల్లోకి ఎగిరింది.కానీ 2016 నుంచి ఇప్పటివరకు తొలి 40 విమానాల సరఫరా కూడా పూర్తి కాలేదు" అని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.