'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ
కర్ణాటకలో అమూల్ వర్సెస్ నందిని గొడవ ఎంతటి రాజకీయ దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆఖరికి అది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా కూడా మారిపోయింది. అయితే ఇప్పుడు తమిళనాడు వంతు వచ్చింది. తమిళనాడులో అమూల్ వర్సెస్ రాష్ట్ర సహకార సంస్థ అయిన ఆవిన్ రగడ రాజుకుంది. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆవిన్ మిల్క్ షెడ్ నుంచి గుజరాత్‌కు చెందిన మిల్క్ కోఆపరేటివ్ సంస్థ అమూల్ పాలు కొనుగోలు చేయడం అనారోగ్యకర పోటీని సృష్టిస్తుందని స్టాలిన్ చెప్పారు. ఆ చర్యను మానుకునేలా నియంత్రించాలని లేఖలో సూచించారు.
శ్వేత విప్లవం స్ఫూర్తికి విరుద్ధంగా వ్వవహరిస్తున్న అమూల్: స్టాలిన్
అమూల్ ఇప్పటి వరకు తమిళనాడులోని ఔట్‌లెట్ల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తోందని, తాజాగా శీతలీకరణ కేంద్రాలు, ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి బహుళ-రాష్ట్రాల లైసెన్స్‌ను ఉపయోగించినట్లు తమ దృష్టికి వచ్చిందని షాకు రాసిన లేఖలో స్టాలిన్ తెలిపారు. తమిళనాడులోని కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, రాణిపేట్, తిరుపత్తూరు, కాంచీపురం, తదితర జిల్లాల్లో పాలను సేకరించేందుకు అమూల్ సిద్ధమవుతున్నట్లు స్టాలిన్ వెల్లడించారు. 1970లో ప్రారంభించిన ఆపరేషన్ వైట్ ఫ్లడ్(శ్వేత విప్లవం)స్ఫూర్తికి విరుద్ధంగా అమూల్ వ్యవహరిస్తోందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. శ్వేత విప్లవం భారతదేశాన్ని పాల కొరత ఉన్న దేశం నుంచి అతిపెద్ద ఉత్పత్తిదారుగా మార్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో పాల కొరత దృష్ట్యా ఇది వినియోగదారుల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు.