Bhagwant Mann: అసెంబ్లీలో వివాదం.. సీఎం తాగి వచ్చారంటూ ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ అసెంబ్లీలో 'మే డే' సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్ మన్ మద్యం సేవించి సభకు హాజరయ్యారంటూ శిరోమణి అకాలీ దళ్ (ఎస్‌ఏడీ) తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో షేర్ చేస్తూ, పవిత్రమైన అసెంబ్లీకి సీఎం ఇలాంటి పరిస్థితిలో రావడం సిగ్గుచేటని విమర్శించింది. సీఎం ప్రవర్తనను ఖండించిన అకాలీ దళ్ పార్టీ, పంజాబ్ ప్రజల సమక్షంలో వెంటనే ఆయనకు డ్రగ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా సీఎంపై తీవ్ర విమర్శలు గుప్పించింది.
వివరాలు
ఎమ్మెల్యేలందరికీ ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించాలి
ఈ అంశంపై స్పందించిన విపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా మాట్లాడుతూ—ముఖ్యమంత్రిపై మద్యం సేవించినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాస్తవాలను నిర్ధారించేందుకు అసెంబ్లీలోని ఎమ్మెల్యేలందరికీ ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. మరో కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందిస్తూ, ప్రభుత్వ పదవీకాలం ముగింపు దశలో ఇలాంటి ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం వల్ల కార్మికులకు ఏ ప్రయోజనం ఉంటుందో చెప్పాలని ప్రశ్నించారు. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా సహా ఏడుగురు రాజ్యసభ సభ్యులు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
వివరాలు
అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
ఇలాంటి క్లిష్ట సమయంలో అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో సీఎం భగవంత్ మాన్‌పై మద్యం సేవించినట్లు ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.