Cough medicine: ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. కేంద్రం కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో సిరప్ ఆధారిత ఔషధాల విక్రయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు సహా వివిధ రకాల మెడికల్ సిరప్‌లను కెమిస్టులు నేరుగా వినియోగదారులకు విక్రయించరాదని స్పష్టం చేసింది. ఈ ఔషధాలను కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉండాల్సిందేనని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు 1945 ఔషధ నిబంధనల్లో సవరణలు చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త మార్పుల ప్రకారం ఇప్పటివరకు తయారీ, విక్రయం, పంపిణీకి సంబంధించి కొన్ని మినహాయింపులు పొందుతున్న 'షెడ్యూల్-K' జాబితా నుంచి సిరప్‌లను తొలగించింది. దీంతో ఇవి ఇకపై 'ఓవర్ ది కౌంటర్' (OTC) ఔషధాల కేటగిరీలో ఉండవు.
వివరాలు
ముసాయిదా పరిశీలన అనంతరమే నిర్ణయం
ఇటీవలి కాలంలో ఓరల్ లిక్విడ్ ఔషధాలు, ముఖ్యంగా దగ్గు సిరప్‌ల నాణ్యత, భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కొన్ని సందర్భాల్లో దగ్గు సిరప్‌ల కారణంగా మరణాలు సంభవించాయనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2025 డిసెంబర్‌లోనే ఈ మార్పుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ ముసాయిదాపై ప్రజలు, వైద్య నిపుణులు, సంబంధిత వర్గాల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB)తో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలిపింది.
వివరాలు
వెంటనే అమల్లోకి కొత్త నిబంధనలు
కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై డాక్టర్ రాసిచ్చిన ప్రిస్కిప్షన్ లేకుండా ఏ కెమిస్ట్ కూడా దగ్గు సిరప్‌లు లేదా ఇతర సిరప్ ఆధారిత ఔషధాలను విక్రయించకూడదని ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా సిరప్‌ల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ప్రజలకు మరింత సురక్షితమైన వైద్య సేవలు అందించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఔషధాల వినియోగం వైద్యుల పర్యవేక్షణలోనే జరగడం ద్వారా అనారోగ్య సమస్యలు, ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు.