Loading...
Parliament: పార్లమెంట్ సమావేశాలకు కౌంట్‌డౌన్.. మహిళా రిజర్వేషన్‌, పునర్విభజన బిల్లులపై ఉత్కంఠ
పార్లమెంట్ సమావేశాలకు కౌంట్‌డౌన్.. మహిళా రిజర్వేషన్‌, పునర్విభజన బిల్లులపై ఉత్కంఠ

Parliament: పార్లమెంట్ సమావేశాలకు కౌంట్‌డౌన్.. మహిళా రిజర్వేషన్‌, పునర్విభజన బిల్లులపై ఉత్కంఠ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2026
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

అధికార, విపక్షాల సంఖ్యాబలంలో చోటుచేసుకున్న మార్పులు, కీలక బిల్లుల ప్రవేశపెట్టే అవకాశాల నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే ఈ సమావేశాలు ప్రారంభం నుంచే వాడీవేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశాలకు ముందే శనివారం రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించడం ఒకటి కాగా, శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేనలో విలీనమయ్యేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వడం మరో ముఖ్య పరిణామంగా నిలిచింది.

వివరాలు

ఆ రోజే 'మార్చ్ టు పార్లమెంట్' పేరుతో నిరసనలు

ఈ రెండు అంశాలు ఆదివారం జరగనున్న అఖిలపక్ష సమావేశంతో పాటు 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసలు పార్లమెంట్ సమావేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, సమావేశాలు ప్రారంభమయ్యే రోజే 'మార్చ్ టు పార్లమెంట్' పేరుతో ఆందోళన చేపట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునివ్వడం కూడా రాజకీయ ఉత్కంఠను పెంచుతోంది.

వివరాలు

కీలక బిల్లులపై ఎత్తులు.. పైఎత్తులు

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రతిష్ఠాత్మక బిల్లును ఇప్పటివరకు అధికారిక ఎజెండాలో చేర్చలేదు.

ఈ బిల్లుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సమీకరించేందుకు అధికార కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా, దానిని అడ్డుకునేందుకు విపక్ష కూటమి 'ఇండియా' వ్యూహాలు రచిస్తోంది.

ఇటీవల ఇండియా కూటమితో దూరమైన 'డీఎంకే' పార్లమెంట్‌లో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరింది.

మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి 'నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)'లో చేరినట్లు ప్రకటించిన 20 మంది ఎంపీలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలన్న అభ్యర్థనను స్పీకర్ ఆమోదించారు.

అయితే వారిని అధికారికంగా ఆ పార్టీ సభ్యులుగా గుర్తించాలా లేదా అన్న అంశంపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.

ADVERTISEMENT

వివరాలు

చర్చకు వచ్చే కీలక అంశాలు

ఈ సమావేశాల్లో అయోధ్య విరాళాల చోరీ వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై సభలను స్తంభింపజేస్తామని సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.

అదేవిధంగా విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లు, వికసిత భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు వంటి కీలక బిల్లులు కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి.

ఇవే కాకుండా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం, దేశ విదేశాంగ విధానం వంటి అంశాలపై కూడా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగే అవకాశం ఉంది.

అలాగే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ సభలో గట్టిగా పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT