LOADING...
Madhya Pradesh: ..బుల్లెట్‌,కాలిన గాయాలతో.. కారులో ప్రేమికుల మృతదేహాలు
బుల్లెట్‌,కాలిన గాయాలతో.. కారులో ప్రేమికుల మృతదేహాలు

Madhya Pradesh: ..బుల్లెట్‌,కాలిన గాయాలతో.. కారులో ప్రేమికుల మృతదేహాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2026
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమజంట అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. అశోక్‌నగర్‌లో పార్క్ చేసి ఉన్న కారులో యువకుడు, యువతి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తిని రితిక్ సోనీగా గుర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి తలలో బుల్లెట్ గాయం ఉండటంతో పాటు ముఖంపై కాలిన గాయాలు కూడా కనిపించాయి. కారులోని పక్క సీటులో ఉన్న యువతిని ముస్కాన్‌గా గుర్తించారు. ఆమె గొంతు కోసి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులిద్దరూ అశోక్‌నగర్‌కు చెందిన వారేనని ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.

వివరాలు 

జిమ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ముస్కాన్

ముస్కాన్ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బుధవారం మధ్యాహ్నం జిమ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ ద్వారా సంప్రదించేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇక రితిక్ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 15 రోజుల క్రితం రితిక్ ఇండోర్ నుంచి అశోక్‌నగర్‌కు వచ్చినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. కారులో ఉన్న మృతదేహం తన కుమారుడు రితిక్‌దేనని అతడి తండ్రి రాకేశ్ సోనీ పోలీసులకు వివరించారు.

వివరాలు 

కారులో పిస్తోల్‌, గొడ్డలి, కట్టర్ స్వాధీనం

సమాచారం అందుకున్న ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలను సేకరించింది. కారులో నుంచి ఒక పిస్తోల్‌, రక్తపు మరకలతో ఉన్న గొడ్డలి, కట్టర్‌ను స్వాధీనం చేసుకుంది. అలాగే కారు నుంచి సుమారు 50 మీటర్ల దూరంలో మూడు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో రితిక్, ముస్కాన్ గతంలో ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కలిసి పనిచేసినట్లు సమాచారం లభించింది. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదికతో పాటు ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చిన తర్వాత మృతికి గల అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement