CP Sajjanar: ఫిర్యాదుల నమోదు ఇక సులువు.. ఏఐ యాప్‌ను ప్రారంభించిన సీపీ సజ్జనార్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు నమోదు వ్యవస్థ 'ఏఐ కాప్‌రైటర్' యాప్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా 10కిపైగా భాషల్లో ఫిర్యాదులను నమోదు చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఫిర్యాదు దారుడు చెప్పే వివరాలను యాప్ తక్షణమే టెక్ట్స్‌గా మార్చడంతో పాటు అవసరమైన భాషలోకి అనువదించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా, నమోదు చేసిన ఫిర్యాదు వివరాలు ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో సేవ్ అయ్యే విధంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు.
వివరాలు
80కి పైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్
ముఖ్యంగా వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భాష కారణంగా ఎవరూ న్యాయానికి దూరం కాకూడదన్న లక్ష్యంతోనే ఈ ఏఐ ఆధారిత వ్యవస్థను తీసుకొచ్చినట్లు వివరించారు. ప్రారంభ దశలో హైదరాబాద్ నగర పరిధిలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియను మరింత వేగవంతంగా, కచ్చితత్వంతో పూర్తి చేయడంలో ఈ యాప్ కీలకంగా పనిచేస్తుందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. కాగా, బ్లూక్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ సంస్థ సహకారంతో ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.