Kerala: కేరళలో సీపీఎం నేత హత్య కేసు.. 9 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కోర్టు జీవిత ఖైదు
ఈ వార్తాకథనం ఏంటి
2005లో కేరళలో సంచలనం సృష్టించిన సీపీఎం కార్యకర్త రిజిత్ శంకరన్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
19 ఏళ్ల క్రితం కన్నూర్ జిల్లాలో జరిగిన ఈ హత్యకేసులో 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు తలస్సేరి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
25 ఏళ్ల రిజిత్‌ను 2005 అక్టోబర్ 3న కన్నాపురం చుండాలోని ఓ దేవాలయం సమీపంలో దాడి చేసి హత్య చేశారు.
రాజకీయంగా అస్థిరతతో నిండిన కన్నూర్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్, సీపీఎంల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల సమయంలో ఈ దారుణం జరిగింది.
రిజిత్ తన స్నేహితులతో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, ఆయుధాలతో ఆర్ఎస్ఎస్ బృందం అతనిపై దాడికి పాల్పడింది.
Details
ప్రాణాలు కోల్పోయిన రిజిత్
ఈ దాడిలో రిజిత్ ప్రాణాలు కోల్పోగా, అతని ముగ్గురు స్నేహితులు గాయపడ్డారు. జనవరి 4న కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించి శిక్ష విధించింది.
మొత్తం 10 మందిపై అభియోగాలు మోపగా, విచారణ సమయంలో ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
శిక్ష పడిన 9 మంది నిందితులు సుధాకరన్ (57), జయేష్ (41), రంజిత్ (44), అజీంద్రన్ (51), అనిల్‌కుమార్ (52), రాజేష్ (46), శ్రీకాంత్ (47), అతని సోదరుడు శ్రీజిత్ (43), భాస్కరన్ (67)గా గుర్తించారు.
హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద వారిని దోషులుగా తేల్చింది.