LOADING...
Air India Plane Crash:అహ్మదాబాద్‌ ఘటన..డ్యూయల్ ఇంజిన్ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందా?  
అహ్మదాబాద్‌ ఘటన..డ్యూయల్ ఇంజిన్ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందా?

Air India Plane Crash:అహ్మదాబాద్‌ ఘటన..డ్యూయల్ ఇంజిన్ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందా?  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఘోరమైన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై అధికారులు సీరియస్‌గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా విమానానికి సంబంధించిన రెండు ఇంజిన్లు ఒకేసారి పనిచేయకుండా పోవడం కావచ్చని తాజా బ్లూమ్‌బర్గ్‌ నివేదికలో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) అధికారుల చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలిదశ దర్యాప్తు నివేదికను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది.

వివరాలు 

రెండు ఇంజిన్లు ఒకేసారి విఫలమైన విషయంపై దర్యాప్తు

ఈ క్రమంలో బ్లూమ్‌బర్గ్‌ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చిన కొన్ని కీలక విషయాలు ఇలా ఉన్నాయి.. ప్రమాదానికి గురైన విమానానికి చెందిన పైలట్లు.. ఫ్లైట్‌ సిమ్యులేటర్‌ ద్వారా విమానం కూలిన సమయంలో ఉన్న పరిస్థితులను పునరావృతం చేశారు. ఇందులో ల్యాండింగ్‌ గియర్‌ ఎలా పనిచేసిందో, రెక్కల ఫ్లాప్స్‌ వెనక్కి తీసుకోవడం వంటి పలు అంశాలను మళ్లీ పరీక్షించారు. అయితే ఈ ప్రయోగాల్లో కనిపించిన కొన్ని సెట్టింగ్‌లు మాత్రమే ప్రమాదానికి పూర్తి కారణం కావని విచారణలో తేలిందని నివేదిక పేర్కొంది. అసలు కారణంగా రెండు ఇంజిన్లు ఒకేసారి విఫలమైన విషయంపై దర్యాప్తు అధికారులు ఎక్కువ దృష్టి సారించారని పేర్కొంది.

వివరాలు 

వైద్య కళాశాల హాస్టల్‌ భవనంపై కూలిపోయిన విమానం 

ఇది అధికారిక దర్యాప్తు నుండి వేరుగా,తాత్కాలికంగా నిర్వహించిన 'సిమ్యులేటెడ్‌ ఫ్లైట్‌' అని సమాచారం.ఈప్రయోగం ప్రమాదం వెనకున్న అసలు కారణాలను అర్థం చేసుకోవడానికి కీలకంగా ఉపయోగపడుతుందని వర్గాలు వెల్లడించాయి. జూన్‌ 12న అహ్మదాబాద్‌ నుండి లండన్‌ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాల వ్యవధిలోనే నగరంలోని ఓ వైద్య కళాశాల హాస్టల్‌ భవనంపై కూలిపోయింది. ఈ హృదయవిదారక ఘటనలో మొత్తం 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, అక్కడే నివాసముంటున్న 19 మంది స్థానికులు కూడా మృతిచెందారు.

వివరాలు 

కొనసాగుతున్న బ్లాక్‌ బాక్స్‌ విశ్లేషణ

అయితే ఈ భయానక ఘటనలో విమానంలోని ఒక వ్యక్తి మాత్రమే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ ఘటనకు సంబంధించి బ్లాక్‌ బాక్స్‌ విశ్లేషణ కూడా ఇంకా కొనసాగుతోంది. దాంతోపాటు, పూర్తి స్థాయి నివేదిక విడుదలైన తరువాతే ప్రమాదానికి గల అసలు కారణాలు తేలే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.