Amaravati: రూ.11,467 కోట్లతో రాజధాని పనుల పునఃప్రారంభానికి సీఆర్డీయే అథారిటీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలి దశ నిర్మాణ పనులకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం తెలిపింది. రూ.11,467 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రూ.2,498 కోట్లతో రహదారుల అభివృద్ధి, రూ.1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు కాలువల నిర్మాణం, మూడు రిజర్వాయర్ల అభివృద్ధి పనులు చేయనున్నారు. అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్-గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణానికి రూ.3,525 కోట్లను కేటాయించారు. భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన స్థలాల అభివృద్ధి పనులకు రూ.3,859 కోట్లను వినియోగిస్తారు. 2019కి ముందు ఉన్న టెండర్లను రద్దు చేసి, కొత్త ఎస్‌ఎస్‌ఆర్ ధరలతో మళ్లీ టెండర్లు పిలుస్తారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు
అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు రూ.984.10 కోట్ల సవరించిన అంచనాలతో కొత్త టెండర్లు పిలుస్తారు. ప్రాజెక్టుల ఆలస్యంతో సీఆర్డీయేకు వచ్చే నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం రూ.270.71 కోట్లను చెల్లిస్తుంది. భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సీఆర్డీయే నిర్ణయించింది. గెజిటెడ్ అధికారులు, క్లాస్-4 ఉద్యోగుల కోసం రూ.594.54కోట్లతో 14 టవర్లను నిర్మిస్తారు. నాన్-గెజిటెడ్ అధికారుల అపార్ట్‌మెంట్లకు రూ.607.50కోట్లను వెచ్చించనున్నారు. అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మిస్తున్న 115 బంగ్లాల పెండింగ్ పనులకు రూ.516.6 కోట్లను కేటాయించారు. భూసమీకరణలో భాగంగా లేఅవుట్ల అభివృద్ధి కోసం 8,496 ఎకరాల్లో రూ.3,859.66 కోట్ల వ్యయంతో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారులు, మంచినీటి సరఫరా, వరదనీటి కాల్వలు, విద్యుత్ వంటి మౌలిక వసతులను సమకూరుస్తారు.
23 అంశాలకు ఆమోదం
అమరావతిలో ప్రధాన రహదారుల పనుల అభివృద్ధికి కూడా సీఆర్డీయే ఆమోదం తెలిపింది. రహదారులను చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారితో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వరద నియంత్రణ కోసం మూడు ప్రధాన ప్యాకేజీలుగా పనులు చేపడతారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీ నుంచి నిధులను సేకరించి ఈ ప్రాజెక్టులను వేగవంతం చేస్తారు. అభివృద్ధి పనుల మంజూరు కోసం జరిగిన సీఆర్డీయే 41వ సమావేశంలో మొత్తం 23 అంశాలకు ఆమోదం లభించింది. అమరావతిని సమగ్ర అభివృద్ధి కలిగిన నగరంగా తీర్చిదిద్దడమే ఈ పనుల ప్రధాన లక్ష్యంగా ఉంది.