LOADING...
Karnataka: దిల్లీకి వరుస పయనాలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో పెరిగిన చిచ్చు
సిద్ధరామయ్య, డీకే పోటాపోటీ అధికార పంపిణీపై పట్టు

Karnataka: దిల్లీకి వరుస పయనాలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో పెరిగిన చిచ్చు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌లో రాజకీయం వేడెక్కింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీ, అధికారంలోకి వచ్చిన రోజునుంచే రెండున్నరేళ్ల తర్వాత బాధ్యతల పంపిణీ జరుగుతుందన్న ప్రచారం వినిపిస్తోంది. గురువారం నాటికి సిద్ధరామయ్య ప్రభుత్వానికి రెండున్నరేళ్లు పూర్తవడంతో అసలు రాజకీయ డ్రామా మొదలైంది. ఇదే సమయంలో, బిహార్‌ ఫలితాల్లో ఎదురైన పరాజయం కారణంగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఇంకా కర్ణాటక అంశాలపై పూర్తి దృష్టి పెట్టలేకపోతుంది. ఈ పరిస్థితుల్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అనుచరులు వరుసగా దిల్లీకి వెళ్లి వస్తూ రాష్ట్ర రాజకీయాలను మరింత ఉద్రిక్తం చేస్తున్నారు.

వివరాలు 

విస్తరణ పైనే దృష్టిపెట్టిన సిద్ధరామయ్య 

బిహార్‌ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ చేరుకున్నారు. రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేలతో విడివిడిగా భేటీ అయిన ఆయన, మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. విస్తరణ జరిగితే మరో ఏడాది పాటు తన సింహాసనం సురక్షితమవుతుందని భావించిన సిద్ధరామయ్య, అధికార పంపిణి అంశాన్ని ప్రస్తావించకుండా విస్తరణపైనే దృష్టి పెట్టారు. దీనిపై ఖర్గేతో చర్చించాలని రాహుల్‌ సూచించినట్టు సమాచారం. కానీ ఖర్గే ఇంతవరకు మంత్రివర్గ విస్తరణపై సీఎంకు సలహా ఇవ్వకపోవటం గమనార్హం. మొదటి నుంచీ అధికార పంపిణీ ఆలోచనను తిరస్కరిస్తున్న సిద్ధరామయ్య, ఐదేళ్లూ సీఎం పదవిని తానే కొనసాగిస్తానన్న నమ్మకంతో ఉన్నారు. 136 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తనవైపు ఉన్నారని ఆయన అంచనా.

వివరాలు 

పావులు కదుపుతున్న డీకే 

అధికార పంపిణీ జరగాల్సి వస్తే ఎమ్మెల్యేల అభిప్రాయమే కీలకమని ప్రకటించి డీకే శిబిరంలో అలజడి రేపుతున్నారు. గురువారం ఆయన ఈ విషయంపై మరింత స్పష్టత ఇస్తూ, తాను హైకమాండ్‌తో మాట్లాడింది అధికార పంపిణి గురించి కాదని, కేవలం మంత్రివర్గ విస్తరణపై మాత్రమే చర్చించానని స్పష్టం చేశారు. సిద్ధరామయ్య వైఖరిపై అసంతృప్తితో ఉన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తన వర్గీయులతో కలిసి వేగంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. బిహార్‌ ఫలితాల తర్వాత ఢిల్లీలో కనిపించినా రాహుల్‌ గాంధీ భేటీకి అవకాశమివ్వకపోవడం డీకే అనుచరుల్లో ఆందోళన కలిగించింది. పార్టీ కోసం తనవంతు శ్రమ పెట్టిన డీకేకు సీఎం పదవి ఇవ్వాలని కొందరు మంత్రులే బహిరంగంగా చెప్పడం పరిస్థితిని మరింత రగిలించింది.

వివరాలు 

పీసీసీ అధ్యక్షుడిగా ఇంకెన్నో రోజులు కొనసాగలేను: డీకే శివకుమార్

డాక్టర్‌ రంగనాథ్, బాలకృష్ణ, ఇక్బాల్‌ హుస్సేన్, గుబ్బి శ్రీనివాస్‌ వంటి పలువురు ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీ చేరుకుని తమ మద్దతు తెలిపితే, శుక్రవారం మరో పదిమంది ఎమ్మెల్యేల బృందం కేసీ వేణుగోపాల్‌ను కలవనుంది. ఇక పీసీసీ అధ్యక్షుడిగా ఇంకెన్నో రోజులు కొనసాగలేనని ప్రకటించిన డీకే శివకుమార్‌ భవిష్యత్తు వ్యూహాలపై సంకేతాలిచ్చారు. సీనియర్‌ మంత్రులు రామలింగారెడ్డి, చలువరాయస్వామిలతో ఆయన జరిపిన చర్చలు కూడా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో, డీకే సోదరుడు, మాజీ ఎంపీ సురేశ్‌.. సిద్ధరామయ్య ఇచ్చిన మాట తప్పరని వ్యాఖ్యానించడంతో, ఇద్దరి మధ్య అధికార పంపిణీ ఒప్పందం జరిగిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వివరాలు 

హైకమాండ్‌లో కన్ఫ్యూజన్ 

బిహార్‌లో ఎదురైన నిరాశతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రస్తుతం కర్ణాటకలో పెద్ద మార్పులకు సిద్ధంగా లేదు. దక్షిణాదిలో కీలకమైన ఈ రాష్ట్రంలో నాయకత్వ మార్పు చేస్తే, అవాంఛిత ప్రతికూలతలు ఏర్పడి 2028 ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని అంచనా వేస్తోంది. సిద్ధరామయ్యను తప్పిస్తే ఆయనకు అండగా ఉన్న ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు దిగే అవకాశముందని భావిస్తోంది. మరోవైపు, ఇప్పుడే బాధ్యతలు వద్దంటూనే.. అధికార మార్పు ఎప్పుడు జరుగుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని డీకే వర్గం కోరుతుండటంతో హైకమాండ్‌ ఇరుక్కుపోయిన పరిస్థితి.