Page Loader
Rajya Sabha Polls: యూపీ, హిమాచల్‌లో క్రాస్ ఓటింగ్ భయాలు.. ఉత్కంఠభరితంగా రాజ్యసభ పోలింగ్ 
Rajya Sabha Polls: యూపీ, హిమాచల్‌లో క్రాస్ ఓటింగ్ భయాలు.. ఉత్కంఠభరితంగా రాజ్యసభ పోలింగ్

Rajya Sabha Polls: యూపీ, హిమాచల్‌లో క్రాస్ ఓటింగ్ భయాలు.. ఉత్కంఠభరితంగా రాజ్యసభ పోలింగ్ 

వ్రాసిన వారు Stalin
Feb 27, 2024
06:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రాస్ ఓటింగ్ ఆందోళనల మధ్య మంగళవారం మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల కాగా.. అందులో 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిన 15స్థానాల కోసం మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో పోలింగ్ జరిగింది. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. యూపీ, హిమాచల్ ప్రదేశ్‌లలో కాంగ్రెస్, ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి, కర్ణాటకలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

రాజ్యసభ

యూపీలో బీజీపీకి ఓటేసిన ఎస్పీ ఎమ్మెల్యేలు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే ఇందులో అసెంబ్లీలో ఉన్నఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం బీజేపీకి ఏడు స్థానాలు, ఎస్పీకి మూడు స్థానాలను రావాలి. అయితే బీజేపీ అనూహ్యంగా ఎనిమిదో అభ్యర్థిని పోటీలో నిలపడంతో పోరు అసక్తికరంగా మారింది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాకేష్ పాండే, అభయ్ సింగ్, రాకేష్ ప్రతాప్ సింగ్, మనోజ్ పాండే, వినోద్ చతుర్వేది, పూజా పాల్, అశుతోష్ మౌర్య ఎన్డీయేకు అనుకూలంగా ఓటు వేసి ఉండవచ్చని తెలుస్తోంది. దీనికి తోడు ఓ బీఎస్పీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి ఓటు వేసినట్లు సమాచారం.

రాజ్యసభ

కర్ణాకటలో కాంగ్రెస్‌కు ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యే!

కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. బీజేపీకి చెందిన ఎస్‌టి సోమశేఖర్, స్వతంత్ర ఎమ్మెల్యే జి జనార్దన రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. బీజేపీ అభ్యర్థులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేశారనే వార్తలను కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఖండించారు. ఇందులో వాస్తవం లేదన్నారు.

రాజ్యసభ

హిమాచల్‌లో 9 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్!

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరిగింది. అయితే ఇక్కడ 9 మంది ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని రాష్ట్ర వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌కు చెందిన సుధీర్ శర్మ, రాజేందర్ రాణా, దేవేందర్ భుట్టో, రవి ఠాకూర్, చైతన్య శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, ఆశిష్ శర్మ (స్వతంత్ర), కేఎల్ ఠాకూర్ (స్వతంత్ర) క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. దీని వల్ల హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీపై గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

రాజ్యసభ

సోనియా, నడ్డా ఏకగ్రీవం

మొత్తం 56 రాజ్యసభ స్థానాల్లో 41మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుజరాత్‌లో ఖాళీ అయిన స్థానం నుంచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా, ఒడిశా నుంచి అధికార బిజూ జనతాదళ్ మద్దతుతో వైష్ణవ్ ఎగువ సభకు రెండవసారి ఏకగ్రీవమయ్యారు. సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ కూడా మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవమయ్యారు. గుజరాత్ వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ ధోలాకియా, జస్వంత్‌సిన్హ్ పర్మార్, ఓబీసీ మోర్చా చీఫ్ మయాంక్ నాయక్ నామినేట్ అయ్యారు. బిహార్‌లో జేడీ(యూ) నేత సంజయ్ ఝా కూడా రాజ్యసభకు వెళ్తున్నారు.