యూనిఫామ్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు: సిబ్బందికి సీఆర్పీఎఫ్ హెచ్చరిక
కేంద్ర రిజర్వుడ్ పోలీసు బలగాలు తమ సిబ్బందికి సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. యూనిఫామ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కడా పంచుకోకూడదని హెచ్చరించింది. హనీ ట్రాప్, సున్నితమైన సమాచారం బయటకు వస్తుందన్న నేపథ్యంలో ఆన్ లైన్ స్నేహాల విషయంలోనూ, తెలియని వారిని ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేయడం విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని కోరింది. కొంతమంది తమకు తెలియని వారికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారని, అలాగే సున్నితమైన ప్రదేశాలలో యూనిఫామ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారని కనుగొనబడటంతో ఇలాంటి కొత్త నిబంధన తీసుకొచ్చారు.
ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
ఈ హెచ్చరిక ప్రకారం ఎవ్వరు కూడా యూనిఫామ్ లో ఉన్న ఫోటోలను ఆన్ లైన్ లో పంచుకోకూడదు. యూనిఫామ్ లో రీల్స్ చేయకూడదు. అలాగే ఆన్ లైన్ లో తెలియని వారితో ఛాట్ చేయకూడదు. ఈ హెచ్చరికను అతిక్రమించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని సీఆర్పీఎఫ్ తెలియజేసింది. తమకు తెలియని వారు ఇంటర్నెట్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయకూడదని కోరింది. ఆన్ లైన్ ఫ్రెండ్ షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఆర్పీఎఫ్ తమ సిబ్బందిని కోరింది.