Kolkata: జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక మలుపు.. 50 మంది రాజీనామా
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జరిగిన వైద్య విద్యార్థిని హత్యాచారం కేసు ఒక కీలక మలుపు తిరిగింది. ఈ దారుణ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరసనలకు, సీనియర్ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు తమ మద్దతు ప్రకటించారు. ఈ ఘటనలో ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో 50 మంది సీనియర్ వైద్యులు, బోధనా సిబ్బంది తమ రాజీనామాలను సమర్పించారు. ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.
మరోసారి నిరసనతో ముందుకొచ్చిన జూనియర్ వైద్యులు
ఈ ఘటనపై పెద్ద ఎత్తున వైద్య విద్యార్థులు, సిబ్బంది ఆందోళనలకు దిగారు. సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు వైద్య విద్యార్థులు ప్రభుత్వంతో చర్చలు జరిపి, 42 రోజుల నిరసన తర్వాత పాక్షికంగా విధుల్లో చేరారు. అయితే తమ భద్రతకు సంబంధించి ప్రభుత్వం నుండి తగిన చర్యలు లేవని పేర్కొంటూ, జూనియర్ వైద్యులు మరోసారి నిరసనలతో ముందుకొచ్చారు.