Loading...
Telangana: ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌.. తెలంగాణలో కొత్తగా 'టీమార్స్‌'
ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌.. తెలంగాణలో కొత్తగా 'టీమార్స్

Telangana: ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌.. తెలంగాణలో కొత్తగా 'టీమార్స్‌'

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2026
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

సైబర్‌ నేరాల నియంత్రణకు టీజీసీఎస్‌బీ.. మాదకద్రవ్యాల కట్టడికి ఈగల్‌.. ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణలో మరో సరికొత్త పోలీస్‌ విభాగం అందుబాటులోకి రాబోతోంది. ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ బ్యూరో (టీమార్స్‌) పేరుతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కొత్త బ్యూరోకు రూపకల్పన చేశారు. ట్రాఫిక్‌ ఇక్కట్ల పరిష్కారంపై పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్వహించిన మేధోమథనం నుంచి ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పోలీస్‌ యూనిట్ల పరిధిలో ట్రాఫిక్‌ విభాగాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్‌ నిర్వహణలో ఏకరూపత లేదు.

వివరాలు

వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

టీజీసీఎస్‌బీ, ఈగల్‌ తరహాలో రాష్ట్ర స్థాయి నుంచి ట్రాఫిక్‌ విభాగాల పనితీరుపై పర్యవేక్షణ కూడా లేదు. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు కొత్త బ్యూరోను ప్రతిపాదించారు.

రాజధాని ప్రాంతంలో తరచూ ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతుండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సైతం తన వాహనశ్రేణికి ట్రాఫిక్‌ విభాగం కల్పించే గ్రీన్‌ఛానల్‌ సదుపాయాన్ని వీలైనంత తక్కువ సమయానికి పరిమితం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

మరోవైపు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో ఏటా సుమారు 7 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ నేపథ్యంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడంతోపాటు ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించే దిశగా పోలీస్‌ ఉన్నతాధికారులు కొత్త బ్యూరో ఏర్పాటును ప్రతిపాదించారు.

వివరాలు

నిధుల సమీకరణకు కీలక ప్రతిపాదన

దానికి ఆమోదం లభిస్తే రాష్ట్రంలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి ఈ బ్యూరో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు పోలీసులు చలానాలు విధిస్తున్నారు.

అయితే మరోవైపు సిగ్నళ్లు సక్రమంగా పనిచేయకపోవడం, జీబ్రా క్రాసింగ్‌లు, స్టాప్‌ లైన్లు తరచూ చెరిగిపోవడం, రోడ్లపై గుంతలు ఉండటం వంటి సమస్యలపై ట్రాఫిక్‌ పోలీసులు విమర్శలు ఎదుర్కొంటున్నారు.

వాస్తవానికి మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ శాఖల మధ్య సమన్వయ లోపం ఈ సమస్యలకు ప్రధాన కారణంగా ఉంది. కొత్త బ్యూరో ఏర్పాటులో భాగంగా ఈ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిధుల సమీకరణపైనా పోలీస్‌ ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

ప్రస్తుతం ట్రాఫిక్‌ చలానాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.400 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఆదాయం వస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

అదనపు డీజీపీ లేదా ఐజీ నేతృత్వంలో..

అయితే ఈ మొత్తంలో ఒక్క రూపాయి కూడా ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగానికి కేటాయించడం లేదు.

ఇకపై చలానాల ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం మేర ట్రాఫిక్‌ విభాగానికి కేటాయించాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు.

కొత్తగా ఏర్పాటు చేయనున్న టీమార్స్‌ బ్యూరో అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 900 మంది సిబ్బందికి ప్రత్యేకంగా ట్రాఫిక్‌ నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నారు.

ఇటీవల గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ విభాగాల నుంచి వెనక్కి రప్పించిన సిబ్బందిని కొత్త బ్యూరోకు కేటాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్‌ నిబంధనల అమలులో ఒకే తరహా విధానాన్ని పాటించేలా ఈ విభాగం పనిచేయనుంది.

ADVERTISEMENT

వివరాలు

హైదరాబాద్‌లో వాహనాల విస్ఫోటం

హైదరాబాద్‌ నగర రోడ్లపై ప్రతిరోజూ సుమారు 95 లక్షల వాహనాలు సంచరిస్తున్నాయి. రోజుకు కొత్తగా దాదాపు 1,500 వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

దీంతో నగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం హైదరాబాద్‌ జిల్లాలోనే ఏకంగా 40.73 లక్షల వాహనాలు ఉన్నాయి.

కేవలం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ జిల్లాలో ప్రతి చదరపు కిలోమీటర్‌కు సగటున 18,770 వాహనాలు ఉన్నాయి.

పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్‌ నిర్వహణను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత టీమార్స్‌ కీలకంగా మారనుంది.

ADVERTISEMENT