LOADING...
CWC: పాలమూరు-పోలవరం ప్రాజెక్టులకు కొత్త లింకు.. కేంద్ర జల సంఘం తాజా ప్రతిపాదనలు
పాలమూరు-పోలవరం ప్రాజెక్టులకు కొత్త లింకు.. కేంద్ర జల సంఘం తాజా ప్రతిపాదనలు

CWC: పాలమూరు-పోలవరం ప్రాజెక్టులకు కొత్త లింకు.. కేంద్ర జల సంఘం తాజా ప్రతిపాదనలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం,పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం,గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రణాళికలను కలిపి కేంద్ర జల సంఘం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనల ప్రకారం తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ సహకరిస్తే,ప్రతిగా పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానానికి అవసరమైన 123టీఎంసీల నికర జలాలను సమకూర్చే మార్గాన్ని సిద్ధం చేయవచ్చని కేంద్ర జల సంఘం సూచించింది. దిల్లీలో మే 1,8తేదీల్లో జరిగిన సమావేశాల్లో ఈ అంశాలపై కేంద్ర జలసంఘం ప్రత్యేక వివరాలు వెల్లడించింది. కేంద్రజలశక్తి కార్యదర్శి కాంతారావు సమక్షంలో జరిగిన ఈచర్చల్లో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలు అంగీకరిస్తే ఈ ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లవచ్చని కేంద్ర జల సంఘం తెలిపింది. అయితే ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రాథమికంగా ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.

వివరాలు 

12 మంది సభ్యులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి శాఖ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కొనసాగుతున్న జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే 12 మంది సభ్యులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. గత ఏడాది జులై 16న ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో సమావేశమైన తర్వాత ఈ కమిటీని ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల నుంచి నలుగురేసి సభ్యులు, కేంద్రం నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి కేంద్ర జల సంఘం ఛైర్మన్ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ కమిటీ తొలి సమావేశం జనవరి 30న జరిగినప్పటికీ ఆ తర్వాత మరో సమావేశం జరగలేదు. ఇటీవల జరిగిన భేటీలోనే కేంద్ర జల సంఘం ఛైర్మన్ ఈ తాజా ప్రతిపాదనలను ప్రస్తావించినట్లు తెలిసింది.

వివరాలు 

పాలమూరు-రంగారెడ్డి పథకానికి 45 టీఎంసీలు 

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నికర జలాల పునఃకేటాయింపుల ఆధారంగా పనులు చేపడుతున్నట్లు చెబుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే న్యాయపరంగా పోరాటం సాగిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల నీటిలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వాటాలు కూడా ఉన్నాయి. అందులో 35 టీఎంసీలను ఆ రాష్ట్రాలు వినియోగిస్తున్నాయి. మిగిలిన 45 టీఎంసీలను నాగార్జునసాగర్ ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతంలో వినియోగించుకునేందుకు అవకాశం ఉందని గోదావరి తీర్పు పేర్కొంటోంది. ఈ 45 టీఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డి పథకానికి వినియోగించేందుకు అంగీకరించాలని కేంద్ర జల సంఘం సూచించింది.

Advertisement

వివరాలు 

వరద జలాల ఆధారంగా పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన ప్రాజెక్టు

తమ రాష్ట్రంలోని చిన్న నీటి వనరుల కేటాయింపుల్లో ఆదా చేసి ఆ 45 టీఎంసీలను వినియోగిస్తామని తెలంగాణ చెబుతుండగా,దీనిపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేయొద్దని కేంద్ర జల సంఘం అభిప్రాయపడింది. ఈ విధంగా పాలమూరు-రంగారెడ్డి పథకానికి మార్గం సుగమమైతే, పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానంపై తెలంగాణను ఒప్పించే అవకాశముందని కూడా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన ప్రాజెక్టును వరద జలాల ఆధారంగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. పోలవరం నుంచి 200టీఎంసీల వరద జలాలను మళ్లించే ప్రణాళికను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి నివేదించింది. అయితే వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులకు ఎలా అనుమతులు ఇస్తామని కేంద్ర జల సంఘం ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా 123టీఎంసీల నికర జలాలను సమకూర్చే లెక్కలను సంఘం వివరించింది.

Advertisement

వివరాలు 

తెలంగాణ కోరుతున్న 47 టీఎంసీల నీటిని పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానానికి మళ్లించే అవకాశం 

జాతీయ జల అభివృద్ధి సంస్థ ఇచ్చంపల్లి నుంచి కావేరి వరకు నదుల అనుసంధాన ప్రణాళికను ప్రతిపాదిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా తెలంగాణలోని సమ్మక్క-సారక్క బ్యారేజీ నుంచి నీటిని తరలించే ఆలోచనను కేంద్ర జల సంఘం ముందుకు తెచ్చింది. అలా జరిగితే సమ్మక్క-సారక్క బ్యారేజీ కింద తెలంగాణ కోరుతున్న 47 టీఎంసీల నీటిని పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానానికి మళ్లించే అవకాశముంటుందని పేర్కొంది. పాలమూరు-రంగారెడ్డి పథకానికి గోదావరి నుంచి 45టీఎంసీలు ఇచ్చిన ప్రతిఫలంగా తెలంగాణ ఈ నీటిని వదులుకునే పరిస్థితి రావచ్చని భావిస్తోంది. గోదావరి-కావేరి అనుసంధాన ప్రణాళిక ద్వారా 148టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉందని జాతీయ జల అభివృద్ధి సంస్థ అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టును ఛత్తీస్‌గఢ్ వాటా జలాల ఆధారంగా చేపట్టాలని కేంద్రం యోచిస్తోంది.

వివరాలు 

తుంగభద్రలోకి మరో 16 టీఎంసీల నీరు

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 45 టీఎంసీల నికర జలాలు లభిస్తాయని కేంద్ర జల సంఘం లెక్కలు చూపిస్తోంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఆమోద సమయంలో 16 టీఎంసీల జలాలను పరిగణలోకి తీసుకోలేదని, ఇప్పుడు ఆ నీటిని కూడా నల్లమలసాగర్‌కు వినియోగించవచ్చని కేంద్ర జల సంఘం తెలిపింది. కర్ణాటక చేపడుతున్న బేడితి-వరద అనుసంధాన ప్రాజెక్టు ద్వారా తుంగభద్రలోకి మరో 16 టీఎంసీల నీరు చేరుతుందని పేర్కొంది. ఈ అన్ని వనరులను కలిపితే మొత్తం 123 టీఎంసీల నికర జలాలు ఆంధ్రప్రదేశ్‌కు అందుబాటులోకి వస్తాయని కేంద్ర జల సంఘం అంచనా వేస్తోంది.

వివరాలు 

కేంద్ర జల సంఘం లెక్కలపై ఆంధ్రప్రదేశ్ అధికారుల సందేహాలు

తెలంగాణ అవసరాలకు ఆంధ్రప్రదేశ్ సహకరించి, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు తెలంగాణ అంగీకరిస్తేనే ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం ప్రజెంటేషన్‌లో స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే కేంద్ర జల సంఘం చూపిస్తున్న లెక్కలపై ఆంధ్రప్రదేశ్ అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కేటాయింపులు గోదావరి తీర్పులో లేవని, కాగితాలపై కనిపిస్తున్న నీటి లెక్కలు వాస్తవ పరిస్థితులకు సరిపోవని వారు ప్రాథమికంగా అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ అంశంపై రాష్ట్రస్థాయిలో అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి.

Advertisement