Cyclone Dana: తీవ్ర రూపం దాల్చిన 'దానా' తుపాను.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో 'దానా' తుపాను తీవ్రత పెరుగుతోంది. గురువారం ఉదయం నాటికి ఇది తీవ్ర తుపానుగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒడిశాలోని పూరీ, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య బిత్తర్‌కనిక, ధమ్రా (ఒడిశా) ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములో తీరాన్ని దాటవచ్చని తెలిపారు. ఆ సమయంలో గరిష్ఠంగా 120 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇది సుమారు 36 గంటలు తీవ్ర తుపానుగా కొనసాగుతుందని అంచనా వేయబడింది. ఈ తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో 21 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం, మిగిలిన ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
తీరం వెంబడి ఈదురుగాలులు
రాబోయే మూడు రోజులలో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి స్టెల్లా తెలిపారు. 'దానా' తుపాను ప్రభావంతో శుక్రవారం ఉమ్మడి శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్టణం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని పేర్కొన్నారు. కృష్ణపట్నం,వాడరేవు,నిజాంపట్నం,మచిలీపట్నం,కాకినాడ,గంగవరం,విశాఖపట్నం,కళింగపట్నం పోర్టులకు రెండవ నంబరు హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తీరం వెంబడి గురువారం రాత్రి వరకు 80 నుంచి 100 కి.మీ.వేగంతో,గురువారం రాత్రి నుంచి 100 నుంచి 110 కి.మీ.వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ కేంద్రం ఎండీ కూర్మనాథ్ తెలిపారు.
200కు పైగా రైళ్లు రద్దు
ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 'దానా' తుపాను నేపథ్యంలో ఈస్ట్రన్ రైల్వే సీల్దా డివిజన్, గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10గంటల మధ్య 190రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, దక్షిణ మధ్య రైల్వే 14 రైళ్లను రద్దు చేసింది.ఇప్పటివరకు దాదాపు 200 రైళ్లు సర్వీసులు రద్దు లేదా దారిమళ్లించినట్లు సమాచారం. ఒడిశాలో పరీక్షలు వాయిదా ఈ తుపానుతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది.ముందస్తు చర్యల్లో భాగంగా 23వ తేదీ నుంచి 25 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేసింది. ఈ నెల 27న జరగాల్సిన ఒడిశా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను కూడా వాయిదా వేశారు.కొత్త తేదీని తర్వాత ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.