AP News: మరో 6 గంటల్లో తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులోని కారైకాల్ వద్ద తీరం దాటుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాయుగుండం గత ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ శుక్రవారం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారి కర్ణసాగర్ తెలిపారు. ఇది ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలీకి ఉత్తర-ఈశాన్య దిశగా 270 కిలోమీటర్లు, నాగపట్టణానికి తూర్పుగా 300 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 340 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. ఈ వాయుగుండం రాబోయే ఆరు గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వివరించారు.
పుదుచ్చేరి ప్రాంతంలో తీరం దాటే అవకాశం
తదుపరి నవంబర్ 30న మధ్యాహ్నం సమయానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి సమీపంలో, కారైకాల్-మహాబలిపురం తీరాల మధ్య, పుదుచ్చేరి ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు.