మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు
మోచా తుపాను ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్, సిట్వే టౌన్‌షిప్ సమీపంలో, మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో తీరం దాటింది. 1982 నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అత్యంత శక్తివంతమైన తుపానుగా 'మోచా' నిలిచింది. మోచా తుపాను తీరం దాటే సమయంలో మయన్మార్‌లో విధ్వంసం సృష్టించింది. తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. గంటకు 209 కి.మీ వేగంతో గాలులు వీయడంతో పాటు వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో పలు టౌన్‌షిప్‌లలోని ఇళ్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, మొబైల్ ఫోన్ టవర్లు, పడవలు, ల్యాంప్ స్తంభాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షానికి వీధులు నదులుగా మారాయి. మయన్మార్ ఓడరేవు నగరమైన సిట్వేను తుపాను ముంచెత్తింది. గాలి వేగానికి భవనాల పైకప్పులు కూలి మయన్మార్‌లో ఆరుగురు చనిపోయారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
శక్తివంతమైన మోచా తుపాను వల్ల దాదాపు 700 మంది గాయపడ్డారని, కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోయినట్లు వార్త సంస్థలు నివేదించాయి. మే 15వ తేదీన మోచా తుపాను బలహీనపడిందని, వాతావరణ శాఖ తన తాజా బులెటిన్‌లో పేర్కొంది. దాదాపు రెండు దశాబ్దాల్లో బంగ్లాదేశ్‌లో కనిపించిన అత్యంత శక్తివంతమైన తుపానుగా మోచా నిలిచినట్లు నివేదికలు చెబుతున్నాయి. మోచా తుపాను విజృంభణ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.