Cyclone Murasu: మురసు తుపాను బీభత్సం.. ఏపీలో 8 మంది మృతి, రూ.1,918 కోట్ల నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో మురసు తుపాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.మంగళవారం తీరాన్ని దాటిన ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.1,918.55 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. బాపట్ల జిల్లాలో ఐదుగురు,గుంటూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి భారీ నష్టం వాటిల్లింది. సుమారు 1,86,063 మంది రైతులకు చెందిన 1,43,122 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు 12,586 మంది రైతులకు సంబంధించి 6,749 హెక్టార్లలో ఉద్యాన పంటలు నాశనమయ్యాయి. వీటితో పాటు 983 ఇళ్లు, 346 పడవలు, 220 చేపల వలలు దెబ్బతిన్నట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.
వివరాలు
సహాయక చర్యలపై చంద్రబాబు సమీక్ష
మురసు తుపాను అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయం, విద్యుత్, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో జరిగిన నష్టంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాత పంట నష్టాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి 48 నుంచి 72 గంటల సమయం అవసరమని అధికారులు సీఎంకు వివరించారు.
వరుసగా వస్తున్న తుపానుల వల్ల రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం,దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టడం, తాగునీటి సరఫరాను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
సహాయక, పునరుద్ధరణ పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.
వివరాలు
వేగంగా కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు
క్షేత్రస్థాయిలో నష్టాన్ని, ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలించేందుకు శుక్రవారం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రకటించారు.
తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఏపీసీపీడీసీఎల్ పరిధిలో మొత్తం 1,103 ఫీడర్లు దెబ్బతినగా, ఇప్పటివరకు 871 ఫీడర్లను తిరిగి పనిచేసేలా చేశారు.
అలాగే దెబ్బతిన్న 3,946 విద్యుత్ స్తంభాల్లో 1,493 స్తంభాలకు మరమ్మతులు పూర్తిచేశారు.
రోడ్లు, భవనాల శాఖ పరిధిలో 760 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రహదారులు దెబ్బతిన్నాయి.
రహదారులపై చెట్లు కూలిపోవడంతో 206 ప్రాంతాల్లో వాటిని తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
వివరాలు
దెబ్బతిన్న పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 74 గ్రామీణ రహదారులు
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 74 గ్రామీణ రహదారులు దెబ్బతిన్నట్లు గుర్తించారు.
వీటిని పునరుద్ధరించేందుకు సుమారు రూ.92.08 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31,428 టెలికాం టవర్లు ఉండగా, వీటిలో 30,518 టవర్లు తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. దీంతో టెలికాం సేవలు 97.1 శాతం వరకు పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
సహాయక చర్యల్లో 24 బృందాలు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 11 ఎస్డీఆర్ఎఫ్, 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
వీటితో పాటు 390 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బాధిత ప్రాంతాల్లో తక్షణ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం జిల్లాలకు రూ.37 కోట్ల నిధులను విడుదల చేసింది.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా, ప్రకాశం బ్యారేజీ వద్ద 43,500 క్యూసెక్కుల నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో కొనసాగుతోంది.
మరోవైపు తమ్మిలేరు వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.