Cyclone: ఏపీకి తుపాను ముప్పు.. నెలాఖరులో తీరం దాటే అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. అలాగే పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీల్లో అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి.
వివరాలు
రెండ్రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం
ఈ అల్పపీడనం ఈ నెల 27 నాటికి వాయుగుండంగా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశముందని భావిస్తున్నారు.
ఆ తర్వాత రెండు రోజులకు తుపానుగా మారి, నెలాఖరులో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.
అయితే అల్పపీడనం ఏర్పడటం, అది వాయుగుండంగా, ఆపై తుపానుగా బలపడటం, తీరాన్ని దాటే ప్రాంతం వంటి అంశాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
దీనిపై మరో రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.