Venezuela: వెనెజువెలాలో చీకటి జీవితం.. కరెంట్ కట్, ఆహారం కోసం క్యూలు
ఈ వార్తాకథనం ఏంటి
ముందస్తు హెచ్చరికలు ఏవీ లేకుండా అమెరికా వెనెజువెలాపై ఒక్కసారిగా మెరుపు దాడులు చేపట్టింది. యూఎస్ మిలిటరీ నిర్వహించిన ఈ వైమానిక దాడులతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా కీలక మౌలిక సదుపాయాలు, విద్యుత్ గ్రిడ్‌లు దెబ్బతినడంతో రాజధాని కారకాస్‌లోని అనేక ప్రాంతాలు చీకట్లో మునిగిపోయాయి. కరెంట్ లేకపోవడంతో ప్రజలు నిత్యావసరాలకే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సూపర్ మార్కెట్లు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో చిన్నచిన్న దుకాణాల వద్ద మాత్రమే సరుకులు లభిస్తున్నాయి. ఆహారం, ఇతర అవసరాల కోసం ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోంది. చాలా చోట్ల 500 నుంచి 600 మంది వరకు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Details
dgk
ఫార్మసీల వద్ద కూడా భారీ క్యూలు ఏర్పడ్డాయని సమాచారం. కారకాస్‌లో నివసిస్తున్న భారతీయుడు సునీల్ మల్హోత్రా అక్కడి పరిస్థితులను మీడియాకు వివరించారు. 'దాడుల్లో భారీ నష్టం జరిగింది. కారకాస్‌లోని విమానాశ్రయంపైనా అమెరికా దాడి చేసింది. నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద వైమానిక స్థావరం కూడా దెబ్బతింది. ముఖ్యంగా ఫోర్ట్‌ట్యూనా మిలిటరీ స్థావరం వద్ద తీవ్ర నష్టం జరిగింది. దాడి అనంతరం అన్ని సూపర్ మార్కెట్లు మూసివేశారు. చిన్న దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయి. వాటి ముందు పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. ప్రతి చోటా వందలాది మంది వేచి చూస్తున్నారు.
Details
ఫార్మసీల పరిస్థితి అధ్వాన్నం
ఫార్మసీల వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది'' అని ఆయన తెలిపారు. దాడుల ప్రభావంతో ప్రజా రవాణా సేవలు కూడా నిలిచిపోయాయని మల్హోత్రా వెల్లడించారు. భయంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా వెనుకాడుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఫోన్లను ఛార్జ్ చేసుకోవడం కూడా పెద్ద సమస్యగా మారిందన్నారు. రోడ్లపై ఉన్న కొన్ని విద్యుత్ దీపాల వద్ద మాత్రమే కరెంట్ ఉండటంతో, అక్కడి నుంచే ప్రజలు తమ మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారని చెప్పారు. తన ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవడానికి కూడా చాలా దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు.
Details
ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు
కరెంట్ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందనే విషయంపై స్థానిక యంత్రాంగం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదన్నారు. కారకాస్‌లో భారతీయుల సంఖ్య చాలా తక్కువగానే ఉందని తెలుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వెనెజువెలాలో నివసిస్తున్న భారతీయుల భద్రత కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం ప్రత్యేకంగా ఓ వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఆ గ్రూప్ ద్వారా భారతీయులకు అవసరమైన సూచనలు, సమాచారాన్ని నిరంతరం అందిస్తున్నట్లు సమాచారం.