Guntur: 'ఎవర్రా మీరంతా'.. మద్యం సీసాలతో మందుబాబుల ఉడాయింపు
చుట్టూ వందల సంఖ్యలో మద్యం సీసాలు ఉండగా, వాటిలో కొన్ని తమకు ఇష్టమైన బ్రాండ్‌లు ఉండటం చూస్తే, మందుబాబులు ఆగుతారా? అసలు ఆగరు. అందుబాటులో ఉన్న మద్యం బాటిళ్లను తీసుకొని జంప్ అయ్యారు.పోలీసులు వారిస్తూ ఉన్నా, మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు కొందరు మద్యం ప్రియులు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం ధ్వంసం కోసం పోలీసులు ఏర్పాట్లు చేస్తుండగా, అక్కడి కు వచ్చిన కొందరు మద్యం ప్రియులు లిక్కర్ బాటిళ్లను తీసుకొని వెళ్లారు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం, గుంటూరు జిల్లాలో, వివిధ కేసుల్లో పట్టుబడిన రూ.50 లక్షల విలువైన అక్రమ మద్యం సోమవారం ఏటూకూరు రోడ్డులోని డంపింగ్ యార్డులో ధ్వంసం చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేసారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది స్థానిక యువకులు,మందుబాబులు డంపింగ్ యార్డుకు వచ్చారు. కళ్ల ముందు నిండి ఉన్న ఫుల్ బాటిళ్లు చూస్తే, వారు ఆగలేకపోయారు. వెంటనే తమకు నచ్చిన బ్రాండ్లను తీసుకొని, అందిన వాటితో పరారయ్యారు.
ఫన్నీ కామెంట్స్‌తో నెటిజన్ల స్పందన
పోలీసులు వారిని వారిస్తున్నా, మందు విషయంలో వారు పట్టించుకోకుండా, చేతిలో మందు సీసాలు పట్టుకుని పరిగెత్తారు. కొందరిని పోలీసులు అడ్డుకోవడంతో వారు మద్యం బాటిళ్లను అక్కడే వదిలేసి వెనుదిరిగారు. పోలీసుల ముందే లిక్కర్ బాటిళ్లను కొట్టేయడం సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో స్పందిస్తున్నారు. కొందరు ''నీ అవ్వా.. మందు విషయంలో తగ్గదేలే'' అని, మరికొందరు 'మందు ముందుంటే పోలీసులైనా డోంట్ కేర్' అంటూ వినోదాత్మకంగా స్పందిస్తున్నారు.