Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. 8 జిల్లాల్లో రికార్డు స్థాయి ఎండలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. భానుడు నిప్పుల జ్వాలలు కురిపిస్తున్నట్టుగా పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల తర్వాత రాష్ట్రంలోని ఎక్కువ పట్టణాల్లో రహదారులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రావడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. మంగళవారం (ఏప్రిల్ 28) నమోదైన ఉష్ణోగ్రతలు గత పదేళ్ల రికార్డులను అధిగమించాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఏడు జిల్లాల్లోని దాదాపు 39 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. నిజామాబాద్ జిల్లాలో 15 మండలాలు, నిర్మల్ జిల్లాలో 10 మండలాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా కనిపించింది. సిద్దిపేట, ఆదిలాబాద్, జగిత్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లోనూ ఎండలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
వివరాలు
నిర్మల్‌లో 46 డిగ్రీలు
నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో 45.9 డిగ్రీలు, ఆదిలాబాద్ సాత్నాలలో 45.6 డిగ్రీలు, కామారెడ్డి బాన్సువాడలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గత కొన్ని రోజులుగా వరుసగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతను తట్టుకోలేక రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆటో డ్రైవర్ భూక్యా రవి (35), కుమురంభీం జిల్లాలో వాంకిడిలో మత్స్యకారుడు చిచోల్కర్ రాందాస్ (44), వికారాబాద్ జిల్లా కండ్లపల్లిలో ఉపాధి హామీ కూలీ కొత్త అనసూజ (41) వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
రానున్న మూడు రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు
ఇక రానున్న మూడు రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ,కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. నేడు, రేపు దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 1 నుంచి 3 వరకు దక్షిణ, తూర్పు తెలంగాణలో మరింత తీవ్ర వడగాలులు వీస్తాయని, 44 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.
వివరాలు
రానున్న మూడు రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు
మే 4 నుంచి 8 వరకు హైదరాబాద్ సహా తెలంగాణలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు, వడగాలులు ఉంటాయని అంచనా. ఈ పరిస్థితుల్లో పగటిపూట అత్యవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండల నుంచి రక్షణ కోసం ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.