Loading...
CM Chandrababu: అక్టోబరు 1 నాటికి కరవు మండలాల ప్రకటన.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
అక్టోబరు 1 నాటికి కరవు మండలాల ప్రకటన.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: అక్టోబరు 1 నాటికి కరవు మండలాల ప్రకటన.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి, ఎక్కడా పంటనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు ఆఖరుకు కరవు మండలాలను గుర్తించి, అక్టోబరు 1న వాటిని ప్రకటించాలని సూచించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, కరవు ప్రభావం, వ్యవసాయ, ఉద్యాన పంటల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పంటల రక్షణ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు కరవు మండలాల గుర్తింపు ప్రక్రియపై సీఎంకు వివరాలు వెల్లడించారు.

వివరాలు

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 513 మండలాల్లో కరవు పరిస్థితులు

వర్షపాతం, పంటల సాగు పరిస్థితి, భూగర్భ జలాలు, నేలలో తేమ శాతం, శాటిలైట్‌ చిత్రాలు, జలాశయాల్లో నీటి నిల్వలు తదితర అంశాల ఆధారంగా కరవు మండలాలను గుర్తిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 513 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు వెల్లడించారు. వీటిలో 268 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా, మరో 245 మండలాల్లో ఓ మోస్తరుగా ఉందని వివరించారు.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని క్షేత్రస్థాయి బృందాలు పంట నష్టం, దిగుబడి నష్టాన్ని పరిశీలించి సెప్టెంబరు 24లోగా జిల్లా కలెక్టర్లకు నివేదికలు సమర్పించనున్నాయి.

ఆ నివేదికలను రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ పరిశీలించి కరవు మండలాలను ప్రకటించనుంది.

ఇందుకు సంబంధించి సెప్టెంబరు 29న రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం జరగనుందని అధికారులు సీఎంకు తెలిపారు.

వివరాలు

ఎక్కువ విస్తీర్ణాన్ని కాపాడాలి

అలాగే ఏపీ సూక్ష్మసేద్య ప్రాజెక్టు కింద నాలుగు కీలక సేవలను 'మన మిత్ర' వాట్సప్‌ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు వివరించారు.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, పంటలను కాపాడేందుకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు.

సూక్ష్మసేద్యంతో పాటు ప్రకృతిసేద్యం వైపు కూడా రైతులను మళ్లించాలని అధికారులను ఆదేశించారు.

ఉద్యాన పంటలను రక్షించేందుకు రూ.190 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 1,357 రైతుసేవా కేంద్రాల పరిధిలోని పంటలు హైరిస్క్‌ జోన్‌లో ఉన్నాయని వెల్లడించారు.

17,916 హెక్టార్లలో సాగవుతున్న బత్తాయి, మామిడి, మిరప, ఉల్లి, కూరగాయల పంటలపై వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఉందని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించాలి

నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలోని పంటలను కాపాడేందుకు సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతినెలా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఆదేశించారు.

తాగునీటి విషయంలోనూ సీఎం అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బోర్లపై ఆధారపడే ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించాలని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు

రెండు నెలలకు సరిపడా తాగునీటి నిల్వలు ఉండాలి

విశాఖ నగరానికి మరో రెండు నెలలకు సరిపడా తాగునీటి నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి పనులను చేపట్టాలని సీఎం ఆదేశించారు.

విశాఖ సమీపంలోని రిజర్వాయర్లను నింపేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

మేఘాద్రిగెడ్డకు పోలవరం ఎల్‌ఎంసీ నుంచి ప్యాకేజీ నంబర్‌ 8 కింద పైపులైన్‌ ద్వారా నీటిని తరలించే పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

ADVERTISEMENT