LOADING...
Telangana: తగ్గుతున్న మిరప సాగు విస్తీర్ణం..పెట్టుబడి పెరగడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు చూపు 
పెట్టుబడి పెరగడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు చూపు

Telangana: తగ్గుతున్న మిరప సాగు విస్తీర్ణం..పెట్టుబడి పెరగడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు చూపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ప్రధాన వాణిజ్య పంటగా నిలిచిన మిరప సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. రెండేళ్ల క్రితం 3.64 లక్షల ఎకరాల్లో సాగు కొనసాగుతుండగా, గత ఏడాది ఇది 2.34 లక్షల ఎకరాలకు పడిపోయింది. ప్రస్తుత సాగు సీజన్‌లో ఇది మరింత తగ్గి 1.80 లక్షల నుంచి 2లక్షల ఎకరాల మధ్యే కొనసాగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిరప సాగు తగ్గడానికి ప్రధాన కారణాలు నల్లి, తామర పురుగులు తీవ్రంగా ఆశించి సాగు ఖర్చు రెట్టింపు కావడమే. మరోవైపు దిగుబడి,ధరలు సగానికి పడిపోవడంతో రైతులు ఈ పంటపై ఆసక్తి కోల్పోతున్నారు. దాంతో చిన్న రైతులు, సన్నకారు రైతులు,గిరిజనులు మిరప సాగును పూర్తిగా వదిలేయగా,పెద్ద రైతులు గతంలో సాగు చేసిన విస్తీర్ణాన్ని సగానికి తగ్గించుకున్నట్లు సమాచారం.

వివరాలు 

రెండు రెట్లు పెరిగిన ఖర్చు.. 

మూడేళ్ల క్రితం వరకు ఒక్క ఎకరా మిరప సాగుకు రూ.50 వేలు నుంచి రూ.60 వేలు వరకు ఖర్చు అయ్యేది. ఆ సమయంలో ఎకరానికి సగటున 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి లభించేది. అంతేకాదు,క్వింటా ధర రూ.20 వేలు పైగానే పలికేది. కానీ గత మూడేళ్లుగా మిరప సాగు చేస్తున్న రైతులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. నల్లి,తామర పురుగులు అధికంగా ఆశించడంతో ఒక ఎకరా సాగు ఖర్చు రూ.లక్షను దాటుతోంది. పైగా దిగుబడి 15 నుంచి 18క్వింటాళ్లకే పరిమితమవుతోంది. క్వింటా ధర మాత్రం రూ.12 వేల నుంచి రూ.13వేల మధ్యే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల మధ్య ప్రత్యామ్నాయంగా పత్తి, మొక్కజొన్న, పెసర, వేరుసెనగ, కొంతవరకూ వరి పంటల వైపు రైతులు మళ్లుతున్నారు.

వివరాలు 

ప్రధాన జిల్లాల్లో తీవ్ర ప్రభావం.. 

ఉమ్మడి జిల్లాల పరిస్థితిని పరిశీలిస్తే.. ఖమ్మం జిల్లాలో 2023-24లో 1.50 లక్షల ఎకరాల్లో సాగైన మిరప ఈ ఏడాది 80 వేల ఎకరాలకు పడిపోయే అవకాశముంది. వరంగల్‌లో 1.22 లక్షల ఎకరాల నుంచి 70 వేల ఎకరాలకు, మహబూబ్‌నగర్‌లో 81 వేల నుంచి 50 వేల ఎకరాలకు, నల్గొండలో 30 వేల నుంచి 20 వేల ఎకరాలకు తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

నిపుణుల సూచన.. 

ఈ పరిస్థితులపై మహబూబాబాద్ జిల్లా మల్యాల జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ప్రశాంత్ మాట్లాడుతూ.. ''నల్లి సమస్యతో సాగు వ్యయం పెరిగింది, దిగుబడులు తగ్గాయి. మార్కెట్‌లో ధర పడిపోవడం కూడా మిరప సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని నల్లి, తామర పురుగులను తట్టుకునే మిరప రకాలను రైతులకు సూచిస్తున్నాం. అంతేకాదు, రసాయన మందుల వాడకం, అవగాహన అంశాలపై రైతులకు తెలియజేస్తున్నాం'' అని వివరించారు.