Ship Attacks: భారతీయులున్న నౌకలపై అమెరికా దాడులు.. వెంటనే నిలిపివేయాలన్న భారత్
ఈ వార్తాకథనం ఏంటి
ఒమన్ తీరానికి సమీపంలో భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న నౌకలను వరుసగా అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత వారం రోజుల్లో భారతీయులున్న మూడు నౌకలపై దాడులు జరగడం తీవ్ర విచారకరమని పేర్కొంది. ఈ తరహా ఘటనలను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ అంశంపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల పశ్చిమాసియా ప్రాంతంలో భారత నావికులు లక్ష్యంగా పలు ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఒమన్ తీరంలో తాజాగా జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.
వివరాలు
చర్చలు, దౌత్యపరమైన చర్యల ద్వారా శాంతి నెలకొల్పాలని భారత్ పిలుపు
ఈ ఘటనపై దిల్లీలోని అమెరికా దౌత్యాధికారిని విదేశాంగ శాఖకు పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. పశ్చిమాసియా ప్రాంతంలో నౌకలపై వరుస దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నారు. పరిస్థితులు మరింత దిగజారకుండా దాడులను తక్షణమే నిలిపివేసి, చర్చలు, దౌత్యపరమైన చర్యల ద్వారా శాంతి నెలకొల్పాలని భారత్ పిలుపునిచ్చింది. ఇక ఈ దాడులకు సంబంధించిన వివరాలను షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముకేశ్ మంగళ్ వెల్లడించారు. జూన్ 8 నుంచి వరుస ఘటనలు నమోదవుతున్నాయని తెలిపారు. ఆ రోజు మారివెక్స్ నౌకలో మంటలు చెలరేగగా, అందులో ఉన్న 24 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు.
వివరాలు
భారత జెండాతో ప్రయాణిస్తున్న 13 నౌకలు
జూన్ 10న సెటెబె వాణిజ్య నౌకను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుందని వెల్లడించారు. ఈ ఘటనలో 21 మంది భారతీయులను సురక్షితంగా రక్షించగా, ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే జూన్ 11న ఎంటీ జలవీర్ నౌకపై కూడా దాడి జరిగినట్లు తెలిపారు. అయితే, అందులో ఉన్న 20 మంది భారతీయ సిబ్బంది క్షేమంగా ఉన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం హర్మూజ్ ప్రాంతంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న 13 నౌకలు ఉన్నాయని, వాటిలో మొత్తం 562 మంది భారతీయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.