LOADING...
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో రుణం జాప్యం.. సర్కారుపై రోజుకు రూ.2.5 కోట్ల అదనపు భారం!
హైదరాబాద్‌ మెట్రో రుణం జాప్యం.. సర్కారుపై రోజుకు రూ.2.5 కోట్ల అదనపు భారం!

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో రుణం జాప్యం.. సర్కారుపై రోజుకు రూ.2.5 కోట్ల అదనపు భారం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ మెట్రో రైలు తొలి దశ స్వాధీనానికి సంబంధించిన రూ.13,527 కోట్ల రుణం విడుదలలో జాప్యం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతోంది. రుణ ఒప్పందం కుదిరి 20 రోజులు దాటినా ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి నిధులు విడుదల కాకపోవడంతో రోజుకు సగటున రూ.2.5 కోట్ల మేర అదనపు వడ్డీ భారం ప్రభుత్వంపై పడుతోంది. ఈ ఆలస్యానికి సాంకేతిక కారణాలా,లేక ప్రభుత్వం చెబుతున్నట్లుగా రాజకీయ కారణాలా అన్నది స్పష్టత లేకపోయినా ఆర్థికంగా మాత్రం సర్కారుకు నష్టం జరుగుతోంది. హైదరాబాద్‌ మెట్రో తొలి దశను ఎల్‌అండ్‌టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 29న కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

వివరాలు 

మెట్రోపై ఉన్న రూ.13,538 కోట్ల రుణాన్ని ప్రభుత్వ పేరుకు బదిలీ చేసుకునేలా చర్యలు

ఇందులో భాగంగా రూ.1,461 కోట్ల ఈక్విటీ చెల్లించి సంస్థలోని వంద శాతం వాటాలను కొనుగోలు చేసింది. అలాగే అప్పటి వరకు మెట్రోపై ఉన్న రూ.13,538 కోట్ల రుణాన్ని ప్రభుత్వ పేరుకు బదిలీ చేసుకునేలా చర్యలు చేపట్టింది. అయితే, గతంలో మెట్రో నిర్మాణం కోసం తీసుకున్న రుణాలపై అధిక వడ్డీ రేట్లు ఉండటంతో వాటిని రీషెడ్యూల్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం రుణాన్ని ఒకేసారి అందించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌ఎఫ్‌సీ ముందుకు వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌), ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్‌ (హైదరాబాద్‌) లిమిటెడ్‌, ఐఆర్‌ఎఫ్‌సీల మధ్య మే 25న ఢిల్లీలో త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.

వివరాలు 

ఇప్పటికే రూ.130 కోట్ల వడ్డీ భారం

మే నెలాఖరులోగా రుణం విడుదలైతే జూన్‌ 1 నుంచి మెట్రో తొలి దశ పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోకి వస్తుందని, అదే సమయంలో అధిక వడ్డీ భారం నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఆశించిన విధంగా రుణం విడుదల కాకపోవడంతో ఆ ప్రణాళికలు ఆలస్యమయ్యాయి. మెట్రో స్వాధీన ఒప్పందం కుదిరిన ఏప్రిల్‌ 29 నుంచే అప్పులపై వడ్డీ చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. ఐఆర్‌ఎఫ్‌సీతో ఒప్పందం,రుణ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందని భావించిన ప్రభుత్వం అప్పటివరకు సుమారు రూ.80 కోట్ల వరకు మాత్రమే వడ్డీ భారం ఉంటుందని అంచనా వేసింది. అయితే రుణం విడుదల ఆలస్యం కావడంతో వడ్డీ భారం రోజురోజుకూ పెరుగుతూ ఇప్పటికే రూ.130 కోట్లను దాటింది.

Advertisement

వివరాలు 

అన్ని షరతులకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్

రుణం మంజూరు కోసం ఐఆర్‌ఎఫ్‌సీ విధించిన అన్ని నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడంతో పాటు, రుణ వాయిదాలను నేరుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా చెల్లించే విధానానికీ సమ్మతి తెలిపింది. ఈ షరతులన్నింటికి అంగీకరించిన తర్వాతే త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. రుణం మే నెలాఖరులోగా విడుదలవుతుందని ప్రభుత్వం ఆశించినప్పటికీ అది జరగలేదు. దీంతో ఈ నెల రెండో వారంలో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలిసి మెట్రో రెండో దశకు అనుమతులతో పాటు ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రుణం త్వరగా విడుదలయ్యేలా సహకరించాలని కోరారు. అయినప్పటికీ నిధుల విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు.

Advertisement

వివరాలు 

రైల్వే మంత్రిత్వశాఖ అనుమతే అడ్డంకా?

మెట్రో నిర్వహణ ఖర్చులు తీర్చిన తర్వాత మిగిలిన ఆదాయంతో రుణ వాయిదాలు చెల్లించే విధంగా ఐఆర్‌ఎఫ్‌సీతో ఒప్పందం కుదిరిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. టికెట్‌ ఆదాయం, వాణిజ్య సముదాయాల అద్దెలు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని రుణ చెల్లింపులు సకాలంలో జరుగుతాయనే విశ్వాసంతో ఆరు నెలల పాటు చర్చలు జరిపిన అనంతరం ఐఆర్‌ఎఫ్‌సీ రుణానికి అంగీకరించిందని పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం రుణం విడుదలలో జాప్యానికి గల కారణాలపై ఐఆర్‌ఎఫ్‌సీ అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వడం లేదని తెలుస్తోంది. అదనపు సాంకేతిక వివరాలు కూడా కోరలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతర్గతంగా విచారిస్తే రైల్వే మంత్రిత్వశాఖ నుంచి తుది అనుమతి రావాల్సి ఉందని సమాచారం అందుతోందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

వివరాలు 

రుణం విడుదలలో జాప్యం..ప్రభుత్వంపై ఆర్థిక భారం

రూ.13,527 కోట్ల భారీ రుణాన్ని మంజూరు చేసే అధికారం కేవలం ఐఆర్‌ఎఫ్‌సీ అధికారులకు మాత్రమే ఉండదని, సంబంధిత బోర్డు, రైల్వే మంత్రిత్వశాఖ, కేంద్ర ప్రభుత్వ ఆమోదాల తర్వాతే ఈ ఒప్పందం తుది దశకు చేరిందని ఆయన గుర్తు చేశారు. రుణం విడుదలలో కొనసాగుతున్న జాప్యం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement